సాక్షి, నల్లగొండ : ఓ వైపు బతుకమ్మ పాటల గొంతుకలు.. మరోవైపు ‘ప్రత్యేక’ హర్షాతిరేకాలు.. అమరుల త్యాగాల స్మరణం.. మిఠాయిల పంపిణీ.. ర్యాలీల సందడి.. నృత్యాలజోరు.. నినాదాలహోరు.. ఇదీ జిల్లాలో శుక్రవారం కనిపించిన పండగ వాతావరణం. దసరా పదిరోజుల ముందుగానే వచ్చిందన్న ఆనందం జిల్లావాసుల్లో కలిగింది. తెలంగాణ నోట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేయడంపై పల్లెపల్లెనా సంబరాలు జరుపుకున్నారు.
ఈ విజయం అమరవీరుల త్యాగాల ఫలితమేనని తెలంగాణ వాదులు పేర్కొన్నారు. ఇక పార్లమెంట్‌లో బిల్లు పెట్టడం, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం సత్వరమే జరగాలని ఆకాం క్షించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అమరవీరులకు నివాళులర్పించారు. ట్రెజరీ కార్యాలయంలో ఉద్యోగులు స్వీట్లు పంచారు. డీఆర్‌డీఏ, ఐకేపీ ఉద్యోగులు మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ట్రస్మా నేతలు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేత కేక్ కట్ చేయిం చారు. జేఏసీ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడారు.
అంబరాన్నంటిన సంబురాలు..
ఎంపీ రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో భువనగిరిలో, కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో వలిగొండలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పోచంపల్లిలో మండల జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. సూర్యాపేట పట్టణంలో తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు జేఏసీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. బీజేపీ నాయకు లు స్వీట్లు పంచారు. గుట్టలో యువకులు ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూర్(ఎం)లో టీఆర్‌ఎస్, టీడీపీ, జేఏసీల ఆధ్వర్యంలో సంబరాలు చేశారు.
కోదాడలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ముందు బాణసంచా కాల్చారు. అనంతరం స్వీట్లు పంచారు. బీజేపీ నాయకులు బస్టాండ్ వద్ద టపాసులు కాల్చారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆ తర్వాత కేక్ కట్ చేశారు. బైక్ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్, టీఆర్‌ఎస్‌వీ నాయకులు స్వీట్లు పంచారు. ఏబీవీపీ నాయకులు అమరవీరులకు నివాళులర్పించారు. మోత్కూరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. తుంగతుర్తిలో టీఆర్‌ఎస్ నాయకులు మిఠాయిలు పంచారు.
నూతనకల్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. అర్వపల్లిలో టీఆర్‌ఎస్ నాయకులు మిఠాయిలు పంచారు. హుజూర్‌నగర్‌లో తెలంగాణ జేఏసీ, టీఆర్‌ఎస్, న్యూడెమోక్రసీ, బీజేపీ, ఉద్యోగసంఘాలు, విద్యార్థుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించారు. న్యాయవాద జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మఠంపల్లిలో కాంగ్రెస్, జేఏసీల ఆధ్వర్యంలో వేర్వేరుగా టపాసులు కాల్చారు. మేళ్లచెరువులో టీఆర్‌ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో నేరేడుచర్లలో కార్పెంటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీలు తీశారు.
అమరులకు వందనం
Published Sat, Oct 5 2013 4:37 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement