బెదింపులు, నిర్బంధాలకు లొంగేది లేదు
కుట్రలు, కుతంత్రాలను తిప్పి కొడతాం
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి హెచ్చరిక
పాడేరు: మన్యంలో బాక్సైట్ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి పాలకపక్షం చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను తిప్పి కొడతామని, నిర్బంధాలు, బెదిరింపులకు లొంగేది లేదని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరైన చింతపల్లిలోని బహిరంగసభకు వేలాది మంది గిరిజనులు పెద్ద ఎత్తున తరలివచ్చి బాక్సైట్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వ తీరుకు నిరసనగా గళం విప్పారని అన్నారు. బాక్సైట్ దోపిడీకి అడ్డంగా ఉన్నామనే అక్కసుతో తనపై సంబంధం లేని అభియోగాలు మోపి, తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. ఇలాంటి నిర్బంధాలతో బాక్సైట్ ఉద్యమాన్ని అడ్డుకోలేరని హెచ్చరించారు. ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ఉద్యమం సాగిస్తున్నామని, గిరిజనుల హక్కులు, చట్టాలను అడ్డుకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.
బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఉధృతం కావడంతో జీఓ 97ను నిలుపుదల చేస్తామని మంత్రులు నోటిమాటతో సరిపెట్టారని, ప్రభుత్వం దీనిపై ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. ఏడాదికాలంగా బాక్సైట్‌పై సీఎం చంద్రబాబు ఒకమాట, మంత్రులు మరో మాట చెబుతూ గిరిజనులను మోసగిస్తున్నారని విమర్శించారు. బాక్సైట్ విషయంలో ప్రభుత్వ వైఖరిపై గిరిజనులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ప్రత్యక్ష పోరుకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాను సభలో హెచ్చరిస్తే దాన్ని వక్రీకరించారన్నారు. దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించి క్రాస్ పిటీషన్ దాఖలు చేస్తే హైకోర్టు తనకు స్టే ఇచ్చిందని తెలిపారు. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవడానికి తాము చేస్తున్న ధర్మపోరాటంలో విజయం సాధించి తీరుతామని ఈశ్వరి అన్నారు.
బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటాం
Published Fri, Dec 18 2015 11:55 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement