విజయనగరం కంటోన్మెంట్: బీసీ కార్పొరేషన్‌లో కొంత సిబ్బంది బరితెగించారు. రుణాలను మంజూరు చేస్తూ కలెక్టర్ ఇచ్చిన తుది ఆదేశాలనే ఏకంగా మార్చేశారు. ఒక్కొక్క యూనిట్‌కు ఉన్న రుణ విలువను పెంచేసి కొత్తగా ఈ ప్రొసీడింగ్స్‌ను తయారు చేసి, బ్యాంకర్లకు పంపించేశారని సమాచారం. రూ.60 వేల యూనిట్ విలువను రూ. రెండు లక్షల వరకూ పెంచేశారు. ఇలా దాదాపు 40 యూనిట్లను పెంచేశారని సమాచారం. ఈ విషయం హైదరాబాద్‌లోని బీసీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయానికి తెలిసినట్టు భోగట్టా! దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.51.60 కోట్ల విలువైన 9,393 యూనిట్లకు నిధులు మంజూరయ్యాయి. ఈ యూనిట్లకు సంబంధించి వెబ్‌సైట్లో రిజిస్టర్ చేసుకుంటే వాటిని కలెక్టర్ నేతృత్వంలోని మండల, జిల్లా కమిటీలు ఆమోదించిన తరువాత బీసీ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయం ద్వారా ఓబీఎంఎంఎస్ పద్ధతిలో సబ్సిడీ విడుదలవుతుంది. ఈ రుణాల కోసం జిల్లా వ్యాప్తంగా 18,659 మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తరువాత రిజిస్టర్ చేసుకునే సర్వర్‌ను క్లోజ్ చేసేశారు. అనంతరం ఎంపిక జరిగింది. అయితే జన్మభూమి కమిటీల రాజకీయం కారణంగా 9,393 యూనిట్లకూ 4,426 యూనిట్లు మాత్రమే మంజూరయ్యాయి. వీటిని కలెక్టర్ ఆమోదించి సిద్ధం చేశారు.
ఇక్కడే అసలు కిరికిరి జరిగింది. కొందరు దరఖాస్తు చేసుకున్న రుణాలకు సంబంధించి బ్యాంకర్లు విల్లింగ్ ఇచ్చి తరువాత నిరాకరించడంతో వారు మరో బ్యాంకర్ వద్దకు వెళ్లి విల్లింగ్ తెచ్చుకున్నారు. దీనికి సంబంధించి విల్లింగ్ మార్చాల్సి ఉందని, అందువల్ల సర్వర్‌ను కొద్ది సేపు ఓపెన్ చేసి ఉంచాలని సీజీజీ ఇన్‌చార్జిని, బీసీ కార్పొరేషన్ ఈడీ ఆర్‌వీ నాగరాణి కోరారు. దీంతో సీజీజీ ఇన్‌చార్జి ఈ సర్వర్‌ను ఓపెన్ చేసి, తరువాత క్లోజ్ చేశారు. అయితే మరోసారి సర్వర్‌ను మార్చాలని బీసీ కార్పొరేషన్ కార్యాలయం సిబ్బంది కోరడంతో సీజీజీ ఇన్‌చార్జ్ మళ్లీ ఓపెన్ చేశారని, ఈ సమయంలోనే అవకతవకలు చోటుచేసుకున్నాయి తెలుస్తోంది. బ్యాంకుల పేర్లతో పాటు కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చిన యూనిట్ల రుణ విలువను పెంచేశారని సమాచారం. ఇది ఎవరు చేశారన్నది కార్యాలయంలో ఎవరికీ తెలియకపోవడం విడ్డూరం.
ఉదాహరణకు పాచిపెంటకు చెందిన బి. సత్యనారాయణ అనే నిరుద్యోగికి కేటాయించిన యూనిట్ విలువ రూ.60వేలు ఉంటే దానిని రూ.2లక్షలుగా మార్చారు. దీనికి సంబంధించి పాత తేదీతోనే ప్రొసీడింగ్స్ ప్రింట్ తీసి ఈడీ టేబుల్‌పై పెట్టారని తెలిసింది. ఇలా దాదాపు 40 వరకూ మార్పు చేసినట్టు తెలిసింది. కొంతమంది లబ్ధిదారులు సిబ్బందికి డబ్బులిచ్చి ఈ విధంగా యూనిట్లు పెంచుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దిద్దుబాటు జరిగి, యూనిట్ల రుణ పరిమితిని పెంచిన ఫైళ్లు బీసీ కార్పొరేషన్ ఈడీ వద్ద ఉన్నట్టు తెలిసింది. దీనిపై ఈడీ నాగరాణిని వివరణ కోరగా దీనికి సంబంధించి ఇంకా సబ్సిడీ రుణాలు విడుదల కాలేదని, రుణ పరిమితి పెంచినట్టు తన దృష్టికి వచ్చిందని అంగీకరించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు వివరించనున్నామన్నారు.
బీసీ కార్పొరేషన్‌లో బరితెగింపు!
Published Thu, Jul 23 2015 12:18 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement