అమరావతి.. విఫల ప్రయోగమే | BCG representatives submit report to CM YS Jaganmohan Reddy at camp office on 04-01-2020 | Sakshi
Sakshi News home page

అమరావతి.. విఫల ప్రయోగమే

Published Sat, Jan 4 2020 3:44 AM | Last Updated on Sat, Jan 4 2020 11:41 AM

BCG representatives submit report to CM YS Jaganmohan Reddy at camp office on 04-01-2020 - Sakshi

సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీల(కొత్తగా భారీ నగరాన్ని నిర్మించడం) నిర్మాణాలు విఫల ప్రయోగాలుగా మిగిలిపోయాయని బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌(బీసీజీ) నివేదిక వెల్లడించింది. అమరావతి విషయంలో అలాంటి ప్రయోగం రాష్ట్ర ప్రజలకు నష్టదాయకమని.. సంపదంతా ఒకే చోట పోగై మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించింది. అమరావతి రాజధాని నిర్మాణ ప్రణాళికతో పాటు రాష్ట్రంలో 13 జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రపంచంలో గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీలు, రాజధాని నగరాల నిర్మాణాల స్థితిగతులపై అధ్యయనం చేసిన బీసీజీ ప్రతినిధులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి నివేదిక సమర్పించారు.

అమరావతి నిర్మాణం ఆర్థికంగా లాభదాయకం కాదని, పైగా రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టేస్తుందని.. అందువల్ల ఆశించిన ప్రయోజనాలు చేకూరవని నివేదిక స్పష్టం చేసింది. అప్పు చేసి ఒకే చోట రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చుపెడితే.. వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేయడమేనని తేల్చిచెప్పింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మార్గం సుగమం చేయవచ్చని పేర్కొంది. ప్రపంచంలో గత 50 ఏళ్ల అనుభవాల్ని పరిశీలిస్తే.. 30కుపైగా గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీలు నిర్మాణాల్ని చేపడితే అందులో కేవలం రెండు నగరాలు మాత్రమే 50 శాతం లక్ష్యాన్ని సాధించాయని.. మిగతా మెగా సిటీలు 6–7 శాతానికి చేరుకోలేక విఫలమయ్యాయని బోస్టన్‌ అధ్యయనం వెల్లడించింది. అధికార వికేంద్రీకరణ కోసం రెండు ఆప్షన్లు ఇస్తూ.. విశాఖ, అమరావతి, కర్నూలు పట్టణాల్లో పరిపాలనను వికేంద్రీకరించాలని సూచించింది. బోస్టన్‌ నివేదికలోని ముఖ్యాంశాలు ఇవీ..

రూ.1.20 లక్షల కోట్ల ఖర్చు శక్తికి మించిన భారం
‘ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ అప్పు రూ. 2.25 లక్షల కోట్లకు చేరుకుంది. గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక మేరకు అమరావతి నిర్మాణానికి 2045 నాటికి రూ.80 వేల నుంచి 1.20 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది శక్తికి మించిన భారం. ఇందులో 95 శాతం అప్పు రూపంలోనే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇంత వ్యయం చేసినా అమరావతి నగరంలో ఏటా 15 నుంచి 16 శాతం జనాభా వృద్ది చెందితే 2045 నాటికి అమరావతి నుంచి రూ. 8 వేల నుంచి రూ.10 వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది(ప్రపంచంలోని ప్రముఖ నగరాలు దుబాయ్, సింగపూర్, హాంకాంగ్‌ నగరాల్లో గత 60 ఏళ్లలో సగటున జనాభా వృద్ధిరేటు 2 నుంచి 7 శాతం మాత్రమే).. కజకిస్థాన్‌ రాజధాని ‘ఆస్తానా’, దుబాయ్‌ సిటీల అభివృద్ధికి కారణం పెట్రో ఉత్పత్తుల నుంచి భారీ ఎత్తున ఆ దేశాలకు వచ్చే ఆదాయాన్ని విచ్చలవిడిగా వాటి అభివృద్ధికి ఖర్చు చేయడమే..’ అని బీసీజీ స్పష్టం చేసింది.   

గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీలతో ఒరిగేది శూన్యం 
గ్రీన్‌ఫీల్డ్‌ సిటీలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తప్ప, సామాన్య ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు ఏమాత్రం దోహదపడవని బీసీజీ విశ్లేషించింది. ‘గ్రీన్‌ఫీల్డ్‌ నగరాలు పర్యావరణ హితం కావు. ప్రపంచంలోని గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీలను అధ్యయనం చేసిన తరువాత కాలుష్యం పెరగడాన్ని గుర్తించాం. రష్యాలో ఇన్నోపోలీస్, ఈజిప్టులో న్యూ కైరో, సదత్, షేక్‌ జియాద్‌ సిటీ, పోర్చుగల్‌లో ప్లాన్‌ ఐటీ వ్యాలీ, ఆస్ట్రేలియాలో మొనార్టో, చైనాలో చెంగాంగ్, కాంగ్‌బసీ ఆర్డోస్, నానుహీ న్యూ సిటీ, లావాసా, లాంజోహు, యూఏఈలోని మస్డర్‌ మెగా సిటీల నిర్మాణాల్లో లక్ష్యాన్ని చేరుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు’ అని నివేదికలో వెల్లడించారు. ప్రపంచంలో గత 50 ఏళ్లలో 7 దేశాల కేపిటల్‌ సిటీల నిర్మాణాల్ని చేపడితే అందులో కేవలం ఒకటి మాత్రమే లక్ష్యాన్ని చేరుకుందని, మిగతా నగరాలు లక్ష్యంలో 30 శాతం కూడా చేరుకోలేదని పేర్కొన్నారు. 
- 1991లో నైజీరియాలో అబూజాను రాజధాని నగరంగా నిర్మించగా.. 20 లక్షల జనాభా వృద్ధి లక్ష్యానికి గాను కేవలం 30 శాతమే చేరుకుని ఆరు లక్షల జనాభాతో ఆగిపోయింది.  
శ్రీలంక 1982లో శ్రీ జయవర్ధనెపుర కొట్టేలో రాజధాని నిర్మించగా.. 10 లక్షల జనాభా వృద్ధి లక్ష్యానికి గాను కేవలం లక్ష జనాభా కూడా చేరలేకపోయింది.  
1999లో మలేసియా రాజధానిగా పుత్రజయ నిర్మాణం చేపట్టగా 5 లక్షల జనాభా వృద్ధి లక్ష్యానికి గాను కేవలం లక్ష జనాభాతోనే ఆగిపోయింది.  
2007లో దక్షిణ కొరియాలో సెజాంగ్‌ సిటీ నిర్మాణం చేపట్టగా 10 లక్షల జనాభా లక్ష్యానికి గాను ప్రస్తుతం 3 లక్షల జనాభా మాత్రమే ఉంది. 
అమరావతిలో ఏటా సగటున 15 శాతం మేర జనాభా వృద్ధి ఉంటుందని గత ప్రభుత్వం వేసిన అంచనాలన్నీ ఊహాగానాలే తప్ప వాస్తవ రూపం దాల్చవని అధ్యయన నివేదికలో స్పష్టం చేశారు.  

అధికార వికేంద్రీకరణే పరిష్కారం 
రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచికల్లో ఏ జిల్లాలు ముందున్నాయి... ఏ జిల్లాలు వెనుకబడ్డాయి.. అభివృద్ధిలో ఏ ప్రాంతాల మధ్య తారతమ్యాలు, వ్యత్యాసాలున్నాయనే వివరాలను బోస్టన్‌ కన్సల్టెన్సీ తన నివేదికలో వెల్లడించింది. రాజధాని పరిపాలన వ్యవహారాలను వికేంద్రీకరించడంతో పాటు అన్ని జిల్లాల్లో అభివృద్ధిని వికేంద్రీకరించాలని సూచించింది. ఇందుకు ఉదాహరణగా జర్మనీలో గ్రీన్‌ఫీల్డ్‌ మెగా సిటీ నిర్మాణాన్ని ఆపేసి.. రాజధాని పరిపాలన వ్యవహారాలను వికేంద్రీకరించడాన్ని బోస్టన్‌ నివేదిక ప్రస్తావించింది. పరిపాలన వికేంద్రీకరణకు బోస్టన్‌ గ్రూపు రెండు ఆప్షన్లను ప్రభుత్వానికి సూచించింది. మొదటి ఆప్షన్‌లో విశాఖపట్నంలో సచివాలయం, గవర్నర్, సీఎం కార్యాలయాలు, కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం శాసనసభ, హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని... అమరావతిలో అసెంబ్లీతో పాటు కొన్ని శాఖాధిపతుల కార్యాలయాలు, హైకోర్టు బెంచ్‌... కర్నూలులో హైకోర్టు, అనుబంధ కోర్టులు, స్టేట్‌ కమిషన్లు ఉండాలని సూచించింది. రెండో ఆప్షన్‌లో విశాఖపట్నంలో సచివాలయం, గవర్నర్, సీఎం కార్యాలయాలు, అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు, అత్యవసర సమావేశాల కోసం శాసనసభ, హైకోర్టు బెంచ్‌... అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, కర్నూలులో హైకోర్టు, అనుబంధ కోర్టులు, స్టేట్‌ కమిషన్లు ఉండాలని అభిప్రాయపడింది. రెండో ఆప్షన్‌ ఉత్తమమని కమిటీ పేర్కొంది.  

బీసీజీ.. అత్యుత్తమ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ 
ప్రపంచంలో అత్యుత్తమ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ సంస్థల్లో బీసీజీ(బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌), మెకన్సీ, బెయిన్‌ అండ్‌ కంపెనీలు ప్రధానమైనవి. ఒక దేశం.. ఒక రాష్ట్రం, పరిశ్రమల స్థితిగతుల్ని అధ్యయనం చేసి.. వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు ఇవ్వడంలో ఈ సంస్థలు అత్యత్తమమైనవి. ఇందులో బీసీజీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. అందువల్లే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నడుంబిగించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దానికోసం ప్రణాళికను రూపొందించే పనులను బీసీజీకి అప్పగించింది.   

రాష్ట్ర బడ్జెట్‌లో 8 శాతం అప్పుకే కట్టాలి 
ఒకే ప్రాంతంలో అభివృద్ధికి రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేస్తే.. అందుకోసం చేసిన అప్పుల మీద కేవలం వడ్డీ రూపంలోనే ఏటా రూ.8 వేల నుంచి 9 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, ఇది ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌లో 6–8 శాతం సమానంగా ఉంటుందని పేర్కొంది. ‘తొలి 10–15 సంవత్సరాల పాటు వడ్డీ చెల్లించడానికి బడ్జెట్‌లో పది శాతం కేటాయించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయడం వల్ల సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకు నిధులుండవు. దీనికి బదులు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందిచేందుకు పోలవరం–బొల్లాపల్లి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, రాయలసీమ సాగునీటి కాల్వల వెడల్పు కోసం మొత్తం రూ. 1.3 లక్షల కోట్లు వెచ్చిస్తే రాష్ట్రంలో కొత్తగా 90 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అదే జరిగితే రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ. 1.50 లక్షల కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్లకు పెరుగుతుంది’ అని బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ అంచనా వేసింది. అప్పుడు ప్రాజెక్టుల పూర్తికి పెట్టిన పెట్టుబడిని 5 సంవత్సరాల్లో వెనక్కి రాబట్టుకోవచ్చని విశ్లేషించింది. అమరావతి నగరంపై రూ. లక్ష కోట్లు  వ్యయం చేసినా 40 ఏళ్ల వరకు రాబడి వచ్చే అవకాశం లేదని, అది కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సగటున 15–16 శాతం వృద్ధిరేటు నమోదు చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని, అందువల్ల అమరావతిపై భారీగా వ్యయం చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్న విషయమని హెచ్చరించింది.

30కి పైగా నిర్మిస్తే.. అన్నీ విఫలం
లక్షల కోట్లు చొప్పున వెచ్చించి ప్రపంచంలో నిర్మించిన 30కి పైగా కొత్త నగరాల్లో అన్నీ కూడా లక్ష్యాలను సాధించలేక చతికలబడ్డాయి. ఆశించిన స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పన గానీ, అభివృద్ధి గానీ సాధించలేకపోయారని బీసీజీ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. 1980 దశకంలో చైనాలో ప్రారంభించిన షెన్‌జెన్, భారత్‌లో నవీ ముంబయి మాత్రమే కొంతమేరకు లక్ష్యాల్ని సాధించాయని పేర్కొంది. మిగిలిన నగరాల నిర్మాణంతో ప్రజాధనం వృథా కావడం తప్ప వేరే ప్రయోజన మేమీ సాధించలేదని నివేదికలో తెలిపారు. 

చదవండి:

మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!

బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు

డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం..

జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు

రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం


నిపుణుల కమిటీ నివేదిక పరిశీలనకు హై పవర్ కమిటీ

వికేంద్రీకరణకే మొగ్గు

అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ

అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement