మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు! | BCG recommendations on capital city system in the state | Sakshi
Sakshi News home page

మూడు రాజధానులు.. రెండు ఆప్షన్లు!

Published Sat, Jan 4 2020 3:16 AM | Last Updated on Sat, Jan 4 2020 9:36 AM

BCG recommendations on capital city system in the state - Sakshi

శుక్రవారం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదిక సమర్పిస్తున్న బీసీజీ ప్రతినిధులు

సాక్షి, అమరావతి: రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణే ఏకైక మార్గమని బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) విస్పష్టంగా పేర్కొంది. న్యాయ, శాసన, పరిపాలన వ్యవస్థలను వికేంద్రీకరిస్తూ రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అందుకు ప్రభుత్వానికి రెండు ఆప్షన్లను సూచించింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి సాధిస్తూ.. అన్ని రంగాల్లో రాష్ట్ర పురోభివృద్దికి ఓ స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ను రూపొందించింది. రాజధానితోపాటు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం నియమించిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ శుక్రవారం తన నివేదికను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించింది.

రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రాధాన్యత, సహజ వనరులు, అభివృద్ధి అవకాశాలను విశ్లేషిస్తూ సమగ్రాభివృద్ధికి కీలక సూచనలు చేసింది. రాజధాని విషయంలో వివిధ దేశాల్లోని పరిస్థితులను ఉదహరిస్తూ ఆర్థిక భారం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మరీ సిఫార్సులు చేసింది. న్యాయ, శాసన, పరిపాలనా వ్యవస్థలను రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించింది. విశాఖపట్నం, అమరావతి, కర్నూలులో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రెండు ఆప్షన్లను సూచించింది. ప్రాంతీయ ప్రాతినిథ్యం, సమన్వయం, వ్యయం, ప్రజల సౌలభ్యం కోణాల్లో రెండు ఆప్షన్ల అనుకూల, ప్రతికూల అంశాలను బీసీజీ విశ్లేషించింది. రెండు ఆప్షన్లనూ పరిశీలించి, రాష్ట సమగ్రాభివృద్ధి, ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యం 
అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లోని ఉదాహరణలను పరిశీలించి రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ, ప్రధానంగా రాజధాని వ్యవస్థ ఎలా ఉండాలన్నది బీసీజీ సూచించింది. పరిపాలన వికేంద్రీకరణతో బహుళ రాజధానుల వ్యవస్థ ఉండటంతోనే ప్రాంతీయ సమానాభివృద్ధి సాధ్యమని పేర్కొంది. తద్వారానే  ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం సాధ్యమవుతుందని చెప్పింది. తక్కువ వ్యయంతో రాజధాని వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగ్గా, సులువుగా పౌర సేవలు అందించగలమని అభిప్రాయపడింది. జర్మనీ, దక్షిణ కొరియా తదితర దేశాల్లో ఈ విధంగానే సమగ్రాభివృద్ధి సాధిస్తూ, ప్రజలకు మెరుగైన రీతిలో సేవలు అందిస్తున్నారని ఉదహరించింది. అన్ని అంశాలను పరిశీలించి, విశ్లేషించిన మీదట రాష్ట్రంలో కర్నూలు, అమరావతి, విశాఖపట్నం నగరాలను రాజధాని ఏర్పాటు కోసం పరిగణనలోకి తీసుకోవాలని సిఫార్సు చేసింది.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమైన బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు ప్రతినిధులు, ఉన్నతాధికారులు   

రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి సూచనలు
రాష్ట్ర సుస్థిర, సమతులాభివృద్ధికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే దానిపై బోస్టన్‌ కన్సల్టెంగ్‌ గ్రూపు సవివర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిందని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ తెలిపారు. ప్రాంతీయ ఆకాంక్షలు, చారిత్రక నేపథ్యాల్ని దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధించాలంటే ఎలాంటి విధానం ఉత్తమమనే అంశాల్ని బీసీజీ సిఫారసు చేసిందని చెప్పారు. విజయవాడలోని ప్రణాళిక శాఖ కమిషనర్‌ కార్యాలయంలో బీసీజీ నివేదికలోని అంశాలను శుక్రవారం రాత్రి ఆయన మీడియాకు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నివేదికను హైపవర్‌ కమిటీకి రిఫర్‌ చేశారని, ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం, మంత్రివర్గం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.  

వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక సూచీలలో ప్రగతి సాధించేందుకు బీసీజీ సూచనలు..   
- రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో తలసరి పారిశ్రామిక స్థూల అదనపు విలువ(జీవీఏ) మరింతగా పెంపొందించవచ్చు.   
- కృష్ణా, గోదావరి బేసిన్‌ బయట ఉన్న 9 జిల్లాల్లో వ్యవసాయ ఉద్పాదకతను మరింతగా పెంచవచ్చు.  
- రాష్ట్రంలో ప్రస్తుతం మత్స్య ఉత్పత్తిలో 60 శాతం రెండు జిల్లాల నుంచే లభిస్తోంది. ఇతర జిల్లాలపై మరింత దృష్టి సారించడం ద్వారా మత్స్య ఉత్పత్తిని వృద్ధి చేయవచ్చు.  
- ప్రధానంగా మహిళల్లో అక్షరాస్యత శాతాన్ని పెంచాల్సి ఉంది.  
ప్రస్తుతం రాష్ట్రానికి ఏటా 0.3 మిలియన్ల మంది విదేశీ పర్యాటకులు వస్తున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగంలో ఉన్న అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ పర్యాటకులను మరింతగా ఆకర్షించవచ్చు.  
చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారితోపాటు రాష్ట్రం గుండా వెళ్తున్న అన్ని జాతీయ రహదారులతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానించాలి.  
రాయలసీమలో పంటల విస్తీర్ణాన్ని పెంపొందించాలి. కృష్ణా– గోదావరి బేసిన్‌లో 60 శాతం నుంచి 80 శాతం వరకు భూములు సాగుబడిలో ఉన్నాయి. కానీ రాయలసీమలో కేవలం 20 శాతం భూములు మాత్రమే సాగులో ఉన్నాయి. గోదావరి–పెన్నా నదుల అనుసంధానించాలి.

సచివాలయానికి వస్తోంది ఇందుకే.. 
ఏడాదికి మొత్తం లక్ష మంది సచివాలయానికి వస్తే, అందులో 75 శాతం మంది కేవలం ముఖ్యమంత్రి సహాయ నిధి 
కోసమే వచ్చారు.  
ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద చాలా సేవలు అందిస్తున్నా, ఆ సమాచారం తెలియక చాలా మంది సచివాలయానికి వస్తున్నారు.  
- మిగతావారంతా కాంట్రాక్టర్లు, బదిలీలు కోరుకునే వారు,  బిల్లుల కోసం వచ్చే వారే.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి... (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ) 
- ఎనలిటిక్స్, డాటా హబ్‌గా తీర్చిదిద్దాలి.  
- వైద్య పరికరాల ఉత్పత్తి, ఆట బొమ్మల తయారీ పరిశ్రమలు నెలకొల్పాలి. 
- జీడి మామిడి, కాఫీ, పసుపు వంటి వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించాలి. 
భోగపురం విమానాశ్రయాన్ని నిర్మించాలి.  
అరకులో ఎకో, వైద్య టూరిజంను ప్రోత్సహించాలి. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాల నిర్వహణ వేదికగా తీర్చిదిద్దాలి.  

గోదావరి డెల్టా అభివృద్ధికి...(తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి) 
పెట్రో కెమికల్, ప్లాస్టిక్, సోలార్‌ పరిశ్రమలను నెలకొల్పాలి.  
- ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల స్థాపనకు ప్రాధాన్యమివ్వాలి.  
ఉద్యానవన పంటలు, వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు చేపట్టాలి. 
- పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి.  
- రోడ్‌ కనెక్టివిటీని పెంచుతూ బ్యాక్‌వాటర్‌ టూరిజం కేంద్రంగా కోనసీమ, హోప్‌ ఐలాండ్‌లను అభివృద్ధి చేయాలి.  

కృష్ణా డెల్టా అభివృద్ధికి... (కృష్ణా, గుంటూరు) 
ఫుడ్‌ ప్రాసెసింగ్, సిరామిక్స్‌ పరిశ్రమలను నెలకొల్పాలి. 
- హైటెక్‌ సేంద్రియ వ్యవసాయం, మత్స్య పరిశ్రమలను ప్రోత్సహించాలి.  
బందరు పోర్టును నిర్మించాలి.  
బహుళ వినియోగ లాజిస్టిక్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలి. 
- వైద్య సేవలకు ప్రధాన కేంద్రంగా చేస్తూ హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దాలి.  
ఎడ్యుకేషన్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలి. 

దక్షిణాంధ్ర జిల్లాల అభివృద్ధికి... (ప్రకాశం, నెల్లూరు) 
- ఆటోమొబైల్, టెలికాం ఉత్పత్తుల తయారీ పరిశ్రమలను నెలకొల్పాలి.  
- చిన్న తరహా, మధ్యతరహా కాగితం గుజ్జు, చర్మ, ఫర్నిచర్‌ పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయాలి. 
- మత్స్య పరిశ్రమకు కేంద్రంగా తీర్చిదిద్దాలి. 
- మైపాడు బీచ్‌ను అభివృద్ధి చేయాలి.  
- గోదావరి – పెన్నా నదులను అనుసంధానించాలి. కాలువల సామర్థ్యాన్ని పెంపొందించాలి. 
- వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలి. 

తూర్పు రాయలసీమ అభివృద్ధికి... (వైఎస్సార్, చిత్తూరు) 
- స్టీల్, ఎలక్ట్రానిక్స్, అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి.  
- టమాటో ప్రాసెసింగ్‌ యూనిట్లు వంటి హైటెక్‌ వ్యవసాయ పరిశ్రమలను ప్రోత్సహించాలి. 
- గండికోట, బెలూం గుహల (కర్నూలు జిల్లా) కేంద్రంగా ఎకో–అడ్వంచర్‌ పర్యాటక రంగ కేంద్రంగా తీర్చిదిద్దాలి.  
- గోదావరి– పెన్నా నదులను అనుసంధానించాలి. కాలువల సామర్థ్యాన్ని పెంపొందించాలి.  
వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలి.  

పశ్చిమ రాయలసీమ అభివృద్ధికి... (కర్నూలు, అనంతపురం) 
టెక్స్‌టైల్స్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్‌ స్పేర్‌పార్ట్స్‌ పరిశ్రమలను నెలకొల్పాలి.  
బిందుసేద్యాన్ని ప్రోత్సహించాలి. ఆర్గానిక్‌ ఉద్యానవన పంటల సాగును పెంపొందించాలి.  
- విజయనగర సామ్రాజ్య చరిత్ర ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ పెనుకొండ – రాయదుర్గం టూరిజం సర్క్యూట్‌ ఏర్పాటు చేయాలి. 
- గోదావరి– పెన్నా నదులను అనుసంధానించాలి. కాలువల సామర్థ్యాన్ని పెంపొందించాలి.  
- వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేయాలి. అన్ని ప్రాంతాలను జాతీయ రహదారులతో అనుసంధానించాలి.  

చదవండి:

బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు

డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం..

జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు

రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం


నిపుణుల కమిటీ నివేదిక పరిశీలనకు హై పవర్ కమిటీ

వికేంద్రీకరణకే మొగ్గు

అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ

అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement