బాబోయ్‌  భల్లూకం | Bear Halchal In Chinavanka Village Srikakulam District | Sakshi
Sakshi News home page

బాబోయ్‌  భల్లూకం

Published Fri, Aug 23 2019 8:12 AM | Last Updated on Fri, Aug 23 2019 8:13 AM

Bear Halchal In Chinavanka Village Srikakulam District - Sakshi

గుడిలో చిక్కిన ఎలుగుబంటి

సాక్షి, వజ్రపుకొత్తూరు రూరల్‌:  జనావాసంలోకి ఎరక్కపోయి వచ్చిన భారీ భల్లూకం అమ్మవారి గుడిలో ఇరుక్కుపోయింది. గ్రామస్తులు తాళం వేయడంతో రోజంతా ఆలయంలోనే గడిపింది. ఆఖరికి విశాఖ నుంచి జూ అధికారులు వచ్చి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి బోనులోకి తరలించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చినవంక గ్రామ పరిసర ప్రాంత జీడి తోటలో ఉన్న వంక పో  లమ్మ గుడిలోకి గురువారం ఉదయం ఎలు గు బంటి ప్రవేశించింది. జీడి తోట పనులకు కోసం వెళ్లిన రైతులు ఈ విషయాన్ని గమనించారు. అప్రమత్తమై గుడి తలుపులు వేసి గొళ్లెం పెట్టి అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఈ విషయం సోషల్‌ మాధ్యమాలలో హల్‌చల్‌ చేయడంతో ఎలుగును చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు బారులు తీరారు. అయితే సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించి విశాఖపట్నం జూ అధికారులకు సమాచారం అందించారు.  ఉద్దాన తీర ప్రాంతంలో గత కొంత కాలంగా ఎలుగులు హల్‌చల్‌ చేస్తూ ఈ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒక భారీ ఎలుగు ఎప్పటిలాగే సంచరిస్తూ గుడిలో చిక్కింది.

ఎలుగుతో సెల్ఫీ..
గుడిలో చిక్కుకున్న ఎలుగు బంటిని చూసేం దుకు వచ్చిన ప్రజలు ఆసక్తిగా సెల్ఫీలు దిగా రు. మరికొందరు దగ్గరగా ఎలుగును చూసి ఫొటోలకు పోజులు ఇచ్చారు. అలాగే ఎలుగుకు కొంతమంది యువకులు, మహిళలు బిస్కెట్‌లు, రొట్టెలు, బెల్లం, నూనె లాంటి ఆహార పదార్ధాలు అందిస్తూ వీడియోలు, ఫోటోలు తీస్తూ సెల్‌ఫోన్‌లో ఈ చిత్రాలు బంధించారు.

అధికారుల తీరుకు స్థానికుల మండిపాటు..
గుడిలో ఎలుగు ఉన్నట్లు అటవీ శాఖాధికారులకు ఉదయం సమాచారం అందిస్తే సంఘటన స్థలానికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకున్నారు. పరిస్థితి పరిశీలించిన అధికారులు అప్పటికే ఎలుగును చూసేందుకు వచ్చిన ప్రజలను వెళ్లిపోవాలని సూచించారు. ఇప్పుడు ఏమి చేయలేమని గుడి తలుపులు తీసి ఎలుగును బయటకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే దీనిని స్థానికులు అడ్డుకొని అధికారుల తీరును వ్యతిరేకించారు. నిత్యం జీడి సాగులో గడిపే తమపై ఎలుగులు దాడి చేస్తే ఎవరు బా ధ్యత వహిస్తారని నిలదీశారు. దీంతో అధికారులు అక్కడ నుండి వెనుదిరిగి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విశాఖపట్నం జూ అధికారులకు సమాచారం అందించామని, వారు వచ్చే వరకు ఎలుగును రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయరాదని అధికారులు సూచించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ శాఖాధికారులు మీనా బాబు, రజనీకాంత్, రమేష్, తిరుపతి పరిస్థితిని సమీక్షించారు.

ఉత్కంఠకు తెర..
విశాఖపట్నం జూ నుంచి 8 మంది సభ్యులతో రెస్క్యూ టీం రాత్రికి ఘటనా స్థలానికి చేరుకొని, ఎలుగును బంధించే ప్రయత్నం చేశారు. సుమారు 3 గంటల పాటు శ్రమించి బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వైద్యులు శ్రీనివాస్‌ గన్‌తో మత్తు ఇంజెక్షన్‌ వేయడంతో ఎలుగు స్పృహ తప్పి, బోనులో చిక్కింది. అనంతరం దానిని బంధించి విశాఖ జూకి తరలించారు. కార్యక్రమంలో డీఎఫ్‌ లక్ష్మణ్, ఫారెస్టు రేంజర్‌ అమ్మనాయుడు, డిప్యూటీ రేంజర్‌ వీఎసఎన్‌ రాజు, ఎఫెస్‌ఓ రజనీకాంత్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement