- చిత్తూరు మార్గంలో రైలు ప్రయాణం నరకమే
- 72 కి.మీ లకు 3 గంటల ప్రయాణం
- క్రసింగ్‌లు పడ్డాయో ఇక నరకమే
- డబ్లింగ్ రైల్వేలైన్ లేకే అవస్థలు
తిరుపతి అర్బన్: తిరుపతి నుంచి జిల్లా కేంద్రమైన చిత్తూరుకు ఉన్న దూరం 72 కి.మీలు. అయితే ప్యాసింజర్ రైలులో ఈ దూరానికి అయ్యే ప్రయాణ సమయం దాదాపు 3 గంటలు పడుతుంది. అది కూడా ఎలాంటి క్రాసింగ్‌లు లేకుండా ఉంటే...పై సమయం పడుతుంది. ఇక ఏదైనా ఎక్స్‌ప్రెస్‌కో, సూపర్ ఫాస్ట్‌కో క్రాసింగ్ ఇవ్వాల్సి వచ్చిందో ప్రయాణ సమయం మరో గంటైనా అదనంగా పడుతుంది. ఇలా ఏడాది పొడవునా తిరుపతి-చిత్తూరు, చిత్తూరు-తిరుపతి మార్గంలో నరక ప్రయాణం అనుభవిస్తున్న సగటు మనిషి దీనస్థితి ఇది.
తిరుపతి-చిత్తూరు మధ్య ప్రతిరోజూ సుమారు 300 మంది ఉద్యోగులు, 250 మంది టీచర్లు, 2వేల మందికి పైగా విద్యార్థులు, వందల సంఖ్యలో చిరువ్యాపారులు, వేలల్లో యాత్రికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇన్ని వేల మంది ఇబ్బందులు లేకుండా నిర్ణీత సమయంతో ప్రయాణం చేయాలంటే కేంద్రం నుంచి ఈ మార్గంలో డబ్లింగ్ రైల్వేలైన్‌కు అనుమతి రావాలి, పుష్కలంగా నిధుల మంజూరు జరగాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన మొదటి వ్యక్తులు ఎంపీలు. అయితే మన జిల్లా ఎంపీలు ఎప్పుడో ఒకసారి ఈ మార్గానికి డబ్లింగ్ లైన్ అవసరమని ప్రస్తావించి ఊరుకునేశారు. ఆ తర్వాత వారి ప్రస్తావనలకు ఊపిరి పోసేవిధంగా రైల్వే ఉన్నతాధికారులు రూపొందించి న ప్రతిపాదనలు 12ఏళ్లుగా ఫైళ్లు దాటడం లేదు. నిత్యం జనానికేమో తిప్పలు తప్పడం లేదు.
మూడు రెట్లు పెరిగిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు
2003లో బ్రాడ్‌గేజ్‌గా మార్పు జరిగిన చిత్తూరు రైల్వే మార్గంలో తొలుత రెండే రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే నడిచేవి. అయితే ఈ 12 ఏళ్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఈ మార్గంలో రోజూ 11 ట్రిప్పులు తిరుగుతున్న ప్యాసింజర్ రైళ్లకు అడుగడుగునా క్రాసింగ్‌ల సమస్య తప్పడం లేదు.
అలాగే తిరుపతి నుంచి పాకాల మీదుగా అనంతపురం జిల్లావైపు నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా చిత్తూరు మార్గంలో నడిచే ప్యాసింజర్ రైళ్లకు క్రాసింగ్ ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అంతేగాక చిత్తూరు వైపు వెళ్లేందుకు తిరుపతిలో ముందుగా ప్యాసింజర్ రైలు బయల్దేరినా తర్వాత బయల్దేరే ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎక్కడో ఒకచోట క్రాసింగ్ ఇవ్వకతప్పదు.
ఎదురుగా వచ్చే రైళ్లతోనే కాకుండా వెనుక వచ్చే ఎక్స్‌ప్రెస్ రైళ్లతో కూడా ప్యాసింజర్లకు క్రాసింగ్ తిప్పలు తప్పేటట్లు లేదు. ఇలా నిత్యం ప్యాసింజర్లలో ప్రయాణం చేస్తున్న సామాన్యుల గురించి పట్టిం చుకునే నాథుడే కరువయ్యాడు.