జై తెలంగాణ అంటే కొడతారా?
-
ఉద్యోగుల ముసుగులో బెజవాడ రౌడీలను పంపారు: ఈటెల
-
సంస్కారాన్ని చేతకానితనంగా చూడొద్దు: జూపల్లి
-
కానిస్టేబుల్‌ను కొట్టడానికి ఎంత ధైర్యం: పేర్వారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నడిబొడ్డులో జై తెలంగాణ అంటే విచక్షణా రహితంగా దాడిచేశారని, తెలంగాణకు జై కొడితే నేరమా అని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ప్రశ్నిం చారు. పార్టీ నేతలు జూపల్లి కృష్ణారావు, పేర్వారం రాము లు, ఏపీ జితేందర్‌రెడ్డి, డాక్టర్ దాసోజు శ్రవణ్‌తో కలిసి ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఏపీఎన్‌జీవోల సభ ఉద్యోగులది కాదని సీఎం పెట్టుకున్న తెలంగాణ వ్యతిరేక సభ అని స్పష్టంగా తేలిపోయిందన్నారు. ఉద్యోగుల ముసుగులో బెజవాడ రౌడీలను తెలంగాణపైకి దాడులకు పంపారన్నారు. ఉద్యోగుల సభ స్ఫూర్తిగా మిలియన్ మార్చ్ చేస్తామనడం ఇంకా దారుణమన్నారు. ఆనాడు మద్రాసు నుంచి గెటౌట్ అనిపించుకున్నట్టుగానే హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి సృష్టించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలపై పోలీసులతో, రౌడీలతో సీఎం కిరణ్ దాడి చేయిస్తుంటే తెలంగాణ మంత్రులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక నంబరుకు లెసైన్సు తీసుకుని 30 దొంగ బస్సులను ఆంధ్రా ట్రావెల్స్ నడుపుతున్నందుకే ఆర్టీసీ నష్టపోతోందన్నారు.
ఆర్టీసీకి, విభజనకు సంబంధమే లేదని చెప్పారు. కరెంటు తీగలను తాతారావు, కాలువలను కె.ఎల్.రావు అక్రమంగా మలుపుకొంటే రామోజీరావు తన విషపు ఆలోచనలను రాష్ట్ర ప్రజలకు ఎక్కించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఉత్పత్తి అయిన బొగ్గుతో సీమాంధ్రలో విద్యుత్ ప్లాంట్లు పెట్టుకున్నారని, చెప్పుల్లేకుండా వచ్చి దోపిడీలు చేసి కోట్లకు పడగలెత్తారని విమర్శిం చారు. అపోహలను తొలగించుకుంటామని వచ్చిన ఏపీఎన్జీవోలు తెలంగాణవారిపై దాడులు చేసి వెళ్లారన్నారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు సీఎం నిర్మాతగా, డీజీపీ దర్శకుడిగా వ్యవహరించారని జూపల్లి అన్నారు. తెలంగాణ ప్రజల సంస్కారాన్ని, ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవాన్ని చేతకానితనంగా చూడొద్దని హెచ్చరించారు. ఆంధ్రావారు తీరప్రాంతంలో ఉన్నందున నాలుగైదు సింగపూర్లు కట్టుకోవచ్చునని పేర్వారం చెప్పారు. జై తెలంగాణ అన్నందుకు పోలీసు కానిస్టేబుల్‌ను కొట్టడానికి చేతులెలా వచ్చాయని, కొట్టినోడికి ఎంత ధైర్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.