నమ్మించి తీసుకెళ్లారు | Believing Carried | Sakshi
Sakshi News home page

నమ్మించి తీసుకెళ్లారు

Published Sat, Jun 14 2014 2:01 AM | Last Updated on Tue, May 29 2018 3:40 PM

Believing Carried

జమ్మలమడుగు: వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను  నమ్మించి తీసుకెళ్లారని, ఇది టీడీపీ నేత సురేష్‌నాయుడు పనేనని  ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ముసలయ్య, కౌన్సిలర్ సూర్యనారాయణరెడ్డి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం మండల పరిధిలోని దేవగుడిగ్రామంలో వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఎర్రగుంట్ల అభివృద్ధికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విశేష కృషి చేశారన్నారు.
 
 ఆది కృషి, వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానంతో 20 వార్డులకుగాను 18 స్థానాలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీని దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన అభ్యర్థులను ప్రలోభపెడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. ఎర్రగుంట్ల మున్సిపాలిటీని తాము తప్పకుండా కైవసం చేసుకుంటామని అలాకాని పక్షంలో రాజకీయ సన్యాసం చేస్తామన్నారు.
 
 అధికారపార్టీ నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తమ పార్టీకి చెందిన వారు తిరిగివస్తారన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పిలుస్తున్నాడని తన కొడుకుతోపాటు 12వ వార్డు కౌన్సిలర్ అయిన జంధ్యాల మహితను కోగటం నారాయణరెడ్డి పిలుచుకుని వెళ్లినట్లు ఈ సందర్భంగా మాజీ వార్డు మెంబర్ జంద్యాల లక్షుమయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లో ఉన్నారని, సురేష్‌నాయుడు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఫోన్ చేసి తెలిపారన్నారు. తాను బతికినంతకాలం వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సమావేశంలో  ఎర్రగుంట్ల ఇన్‌ఛార్జీ జయరామిరెడ్డి, కౌన్సిలర్లు రఫీ,  పద్మనాభయ్య, సుభాష్‌రెడ్డి, జైబున్నీసా, టి.పార్వతమ్మ, ఉమాదేవి, నాగన్న ,జి.దివ్య తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement