suresh naidu
-
పరిటాల అనుచరుడి ఇంటిపై తమ్ముళ్ల దాడి
పెట్రోల్ పోసి నిప్పంటించిన టీడీపీ నేతలు మంత్రి సునీత ప్రాబల్యం తగ్గించేందుకేనంటున్న పరిశీలకులు అనంతపురం తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు తారస్థాయికి చేరుకుంది. ఇంత కాలం నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు నేడు ప్రత్యక్ష దాడులకు దారి తీశాయి. పార్టీలో ఆధిపత్యం కోసం తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి పరిటాల సునీత ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఆమె ప్రత్యర్థి వర్గం పావులు కదుపుతోంది. ఆమె వర్గీయులపై ప్రత్యక్ష దాడులకు తెగబడుతోంది. ధర్మవరం : ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత వర్గీయుడి ఇంటిపై తెలుగు తమ్ముళ్లు దాడికి దిగారు. తమ నేత ఆదేశించినా వినకుండా సామూహిక వివాహాలకు హాజరయ్యాడన్న ఏకైక కారణంతోనే ఈ దాడి చోటు చేసుకున్నట్లు బాధితుడు వాపోయాడు. వివరాల్లోకి వెళితే... అనంతపురం, ధర్మవరంలోని సత్యసాయి నగర్‌కు చెందిన టీడీపీ నేత సురేష్‌నాయుడు ముందు నుంచి పరిటాల రవికి సన్నిహితుడుగా ఉంటూ వచ్చారు. రవి అనంతరం ఆయన భార్య సునీతకు వెన్నంటే ఉంటూ ఆమె వర్గీయుడిగా ముద్ర వేసుకున్నారు. కాగా, గత నెల 21న రామగిరి మండలంలో పరిటాల సునీత కుటుంబం చేపట్టిన ఉచిత సామూహిక వివాహ కార్యక్రమాలను నిర్వీర్యం చేయడం ద్వారా ఆమె ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు ధర్మవరానికి చెందిన ఓ ప్రముఖ టీడీపీ నేత పావులు కదిపారు. ఇందులో భాగంగానే ధర్మవరం నియోజకవర్గం నుంచి వివాహ కార్యాక్రమాలకు ఎవరూ వెళ్లరాదంటూ హుకుం జారీ చేసినట్లు తెలిసింది. అయితే సునీత వర్గీయుడిగా ముద్ర వేసుకున్న సురేష్‌నాయుడు మాత్రం ఆ హెచ్చరికలు ఖాతరు చేయకుండా ఉచిత వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటి నుంచి అతనిపై ప్రత్యర్థి వర్గీయులు కక్ష పెంచుకున్నారు. ఇదే విషయాన్ని బాధితుడు ధ్రువీకరించారు. ‘పరిటాల వర్గీయుడిగా ఈ ప్రాంతంలో నాకు గుర్తింపు ఉంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని స్థానిక ప్రజాప్రతినిధి కక్ష కట్టి వేధిస్తున్నాడు. గత నెలలో సునీత నిర్వహించిన సామూహిక వివాహాలకు హాజరయ్యాను. ఈ విషయంలో వారు మరింత కక్ష పెంచుకున్నారు. అదే రోజు నా ద్విచక్ర వాహనాన్ని వారు ధ్వంసం చేశారు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. ప్రజాప్రతినిధి ఒత్తిళ్ల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోలేదు. దీనిపై మరింత కక్ష పెంచుకున్న వారు ఆదివారం రాత్రి మా ఇంటి గుమ్మం ఎదుట పెట్రోల్ పోసి నిప్పంటించారు. విషయాన్ని గుర్తించి, వెంటనే మంటలు ఆర్పివేశాం. ప్రధాన ద్వారం పాక్షికంగా కాలింది. ఇంటి బయట ఉన్న వస్తువులు కాలిపోయాయి.’ అంటూ సురేష్‌నాయుడు వివరించారు. ఘటనపై పలువురిపై బాధితుడి ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ భాస్కరగౌడ తెలిపారు. -
విభజించు... పాలించు
ఎర్రగుంట్ల: విభజించు.. పాలించు... ఇది బ్రిటీష్ పాలకుల రీతి.. ప్రస్తుతం ఆర్టీపీపీలో ఇదే పరిస్థితి నెలకొంది. బ్రిటీష్ పాలకులను తలదన్నేలా ఆర్టీపీపీ అధికారులు ప్రవర్తిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలమేరకు కార్మికుల కడుపు కొడుతున్నారు. ఏకంగా 300 మంది కార్మికులను విధుల్లోకి రానీయలేదు.. వారి స్థానంలో తెలుగుతమ్ముళ్లను తీసుకున్నారు. దీంతో విధులకు దూరమైన కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీపీపీ కార్మికులు ఈనెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వివిధ రూపాలలో ఆందోనలు చేపట్టారు. 15వ తేదీ తర్వాత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీపీపీ మెయిన్‌గేటు వద్ద శాంతియుంతంగా నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికార పక్షంతో పాటు ఏపీజెన్కో యాజమాన్యం స్పందించలేదు. ఈ నేపథ్యంలో పోట్లదుర్తికి చెందిన టీడీపీ నాయకుడు సురేష్‌నాయుడు ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల స్థానంలో సుమారు 100 మంది తన అనుచరులను ఆర్టీపీపీలో చేర్పించారు. దీంతో కాంట్రాక్ట్ కార్మికులు అధికారులను కలిశారు. తమకు అన్యాయం చేయవద్దని వేడుకున్నారు.నిబంధనలతో కూడిన ఒప్పంద పత్రంపై సంతకం చేస్తేనే విధుల్లోకి తీసుకుంటామని అధికారులు కార్మికులకు తెలిపారు. దీంతో కొంతమంది కార్మికులు అధికారుల హెచ్చరికలకు తలొగ్గి విధుల్లో చేరారు. దుర్మార్గం ఆర్టీపీపీలో 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నాము.. మేమంతా వైఎస్సార్సీపీకి చెందిన వారమని విధుల్లోనుంచి తప్పించారు.. అధికారులు ఇలా ప్రవర్తించడం ఏమాత్రం సరైనది కాదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారైతే ఒకరకం.. ఇంకొకరైతే మరో రకమా... భారతి, జువారి సిమెంటు ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మద్దతు ఇచ్చిన టీడీపీ నేత సీఎం సురేష్‌నాయుడు ఆర్టీపీపీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలకు మద్దతు ఇవ్వకుండా వారి కడుపులు కొట్టేలా వ్యవహరించడం ఎంత వరకు న్యాయమని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ ధ్వజమెత్తారు. కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న ఆందోళనకు ఆమె మద్దతు పలికారు. కాంట్రాక్టు కార్మికులందరూ ఒకే డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా ఆర్టీపీపీ సీఈ కార్మికుల సమస్యలపై పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కాగా ఆర్టీపీపీలో కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న నిరసనలను భగ్నం చేయడానికి ఆర్టీపీపీ యాజమాన్యం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసింది. ఒక డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, ఎస్పీఎఫ్, స్పెషల్ పార్టీ, ఏఆర్ పార్టీలతో కూడిన బలగాలను రంగంలోకి దించారు. -
11 నుంచీ తిరుపతిలో సీఐఐ ఇన్ఫ్రా సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్షిణ భారత సీఐఐ సదస్సుకు తొలిసారిగా ద్వితీయ శ్రేణి నగరం వేదిక కానుంది. తిరుపతిలో డిసెంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజులు పాటు సీఐఐ సమ్‌ఇన్‌ఫ్రా సదస్సు జరగనుంది. ‘సమ్‌ఇన్‌ఫ్రా-2014’ వివరాలను తెలియచేయడానికి సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐఐ ఏపీ చైర్మన్ సురేష్ రాయుడు చిట్టూరి మాట్లాడారు. మొత్తం ఆరు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొనే ఈ సామవేశాలను డిసెంబర్ 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఇన్ఫ్రా రంగంలో ప్రభుత్వ ప్రైవేటు రంగ భాగస్వామ్య (పీపీపీ) పెట్టుబడుల అవకాశాలు, స్మార్ట్ సిటీ అంశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తుందని సీఐఐ వైస్ చైర్మన్ (ఏపీ) రామచంద్ర ఎన్ గల్లా తెలిపారు. ముగింపు కార్యక్రమంలో కేంద్ర మం త్రులు వెంకయ్యనాయుడు, పీయూష్ గోయల్ తదితరులు పాల్గొంటున్నారు. -
నమ్మించి తీసుకెళ్లారు
జమ్మలమడుగు: వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను నమ్మించి తీసుకెళ్లారని, ఇది టీడీపీ నేత సురేష్‌నాయుడు పనేనని ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ముసలయ్య, కౌన్సిలర్ సూర్యనారాయణరెడ్డి ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం మండల పరిధిలోని దేవగుడిగ్రామంలో వారు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఎర్రగుంట్ల అభివృద్ధికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విశేష కృషి చేశారన్నారు. ఆది కృషి, వైఎస్ జగన్‌పై ఉన్న అభిమానంతో 20 వార్డులకుగాను 18 స్థానాలలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రజలు గెలిపించారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు వైఎస్సార్సీపీని దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ తరపున గెలిచిన అభ్యర్థులను ప్రలోభపెడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. ఎర్రగుంట్ల మున్సిపాలిటీని తాము తప్పకుండా కైవసం చేసుకుంటామని అలాకాని పక్షంలో రాజకీయ సన్యాసం చేస్తామన్నారు. అధికారపార్టీ నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తమ పార్టీకి చెందిన వారు తిరిగివస్తారన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పిలుస్తున్నాడని తన కొడుకుతోపాటు 12వ వార్డు కౌన్సిలర్ అయిన జంధ్యాల మహితను కోగటం నారాయణరెడ్డి పిలుచుకుని వెళ్లినట్లు ఈ సందర్భంగా మాజీ వార్డు మెంబర్ జంద్యాల లక్షుమయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం వారు హైదరాబాద్‌లో ఉన్నారని, సురేష్‌నాయుడు బెదిరింపులకు గురిచేస్తున్నట్లు ఫోన్ చేసి తెలిపారన్నారు. తాను బతికినంతకాలం వైఎస్సార్సీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సమావేశంలో ఎర్రగుంట్ల ఇన్ఛార్జీ జయరామిరెడ్డి, కౌన్సిలర్లు రఫీ, పద్మనాభయ్య, సుభాష్‌రెడ్డి, జైబున్నీసా, టి.పార్వతమ్మ, ఉమాదేవి, నాగన్న ,జి.దివ్య తదితరులు పాల్గొన్నారు.