ఎర్రగుంట్ల: విభజించు.. పాలించు... ఇది బ్రిటీష్ పాలకుల రీతి.. ప్రస్తుతం ఆర్టీపీపీలో ఇదే పరిస్థితి నెలకొంది. బ్రిటీష్ పాలకులను తలదన్నేలా ఆర్టీపీపీ అధికారులు ప్రవర్తిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలమేరకు కార్మికుల కడుపు కొడుతున్నారు. ఏకంగా 300 మంది కార్మికులను విధుల్లోకి రానీయలేదు.. వారి స్థానంలో తెలుగుతమ్ముళ్లను తీసుకున్నారు. దీంతో విధులకు దూరమైన కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీపీపీ కార్మికులు ఈనెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వివిధ రూపాలలో ఆందోనలు చేపట్టారు. 15వ తేదీ తర్వాత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీపీపీ మెయిన్‌గేటు వద్ద శాంతియుంతంగా నిరసన వ్యక్తం చేశారు.
అయినప్పటికీ అధికార పక్షంతో పాటు ఏపీజెన్‌కో యాజమాన్యం స్పందించలేదు. ఈ నేపథ్యంలో పోట్లదుర్తికి చెందిన టీడీపీ నాయకుడు సురేష్‌నాయుడు ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల స్థానంలో సుమారు 100 మంది తన అనుచరులను ఆర్టీపీపీలో చేర్పించారు. దీంతో కాంట్రాక్ట్ కార్మికులు అధికారులను కలిశారు. తమకు అన్యాయం చేయవద్దని వేడుకున్నారు.నిబంధనలతో కూడిన ఒప్పంద పత్రంపై సంతకం చేస్తేనే విధుల్లోకి తీసుకుంటామని అధికారులు కార్మికులకు తెలిపారు. దీంతో కొంతమంది కార్మికులు అధికారుల హెచ్చరికలకు తలొగ్గి విధుల్లో చేరారు.
దుర్మార్గం
ఆర్టీపీపీలో 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నాము.. మేమంతా వైఎస్సార్‌సీపీకి చెందిన వారమని విధుల్లోనుంచి తప్పించారు.. అధికారులు ఇలా ప్రవర్తించడం ఏమాత్రం సరైనది కాదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వారైతే ఒకరకం.. ఇంకొకరైతే మరో రకమా...
భారతి, జువారి సిమెంటు ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మద్దతు ఇచ్చిన టీడీపీ నేత సీఎం సురేష్‌నాయుడు ఆర్టీపీపీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలకు మద్దతు ఇవ్వకుండా వారి కడుపులు కొట్టేలా వ్యవహరించడం ఎంత వరకు న్యాయమని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ ధ్వజమెత్తారు. కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న ఆందోళనకు ఆమె మద్దతు పలికారు. కాంట్రాక్టు కార్మికులందరూ ఒకే డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా ఆర్టీపీపీ సీఈ కార్మికుల సమస్యలపై పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కాగా ఆర్టీపీపీలో కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న నిరసనలను భగ్నం చేయడానికి ఆర్టీపీపీ యాజమాన్యం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసింది. ఒక డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐలు, ఎస్‌పీఎఫ్, స్పెషల్ పార్టీ, ఏఆర్ పార్టీలతో కూడిన బలగాలను రంగంలోకి దించారు.
విభజించు... పాలించు
Published Sun, Dec 21 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM
Advertisement
Advertisement