పెట్రోల్ పోసి నిప్పంటించిన టీడీపీ నేతలు
మంత్రి సునీత ప్రాబల్యం తగ్గించేందుకేనంటున్న పరిశీలకులు
అనంతపురం తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు తారస్థాయికి చేరుకుంది. ఇంత కాలం నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు నేడు ప్రత్యక్ష దాడులకు దారి తీశాయి. పార్టీలో ఆధిపత్యం కోసం తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి పరిటాల సునీత ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఆమె ప్రత్యర్థి వర్గం పావులు కదుపుతోంది. ఆమె వర్గీయులపై ప్రత్యక్ష దాడులకు తెగబడుతోంది.
ధర్మవరం : ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత వర్గీయుడి ఇంటిపై తెలుగు తమ్ముళ్లు దాడికి దిగారు. తమ నేత ఆదేశించినా వినకుండా సామూహిక వివాహాలకు హాజరయ్యాడన్న ఏకైక కారణంతోనే ఈ దాడి చోటు చేసుకున్నట్లు బాధితుడు వాపోయాడు. వివరాల్లోకి వెళితే... అనంతపురం, ధర్మవరంలోని సత్యసాయి నగర్‌కు చెందిన టీడీపీ నేత సురేష్‌నాయుడు ముందు నుంచి పరిటాల రవికి సన్నిహితుడుగా ఉంటూ వచ్చారు. రవి అనంతరం ఆయన భార్య సునీతకు వెన్నంటే ఉంటూ ఆమె వర్గీయుడిగా ముద్ర వేసుకున్నారు. కాగా, గత నెల 21న రామగిరి మండలంలో పరిటాల సునీత కుటుంబం చేపట్టిన ఉచిత సామూహిక వివాహ కార్యక్రమాలను నిర్వీర్యం చేయడం ద్వారా ఆమె ప్రాబల్యానికి చెక్ పెట్టేందుకు ధర్మవరానికి చెందిన ఓ ప్రముఖ టీడీపీ నేత పావులు కదిపారు. ఇందులో భాగంగానే ధర్మవరం నియోజకవర్గం నుంచి వివాహ కార్యాక్రమాలకు ఎవరూ వెళ్లరాదంటూ హుకుం జారీ చేసినట్లు తెలిసింది. అయితే సునీత వర్గీయుడిగా ముద్ర వేసుకున్న సురేష్‌నాయుడు మాత్రం ఆ హెచ్చరికలు ఖాతరు చేయకుండా ఉచిత వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటి నుంచి అతనిపై ప్రత్యర్థి వర్గీయులు కక్ష పెంచుకున్నారు. ఇదే విషయాన్ని బాధితుడు ధ్రువీకరించారు.
‘పరిటాల వర్గీయుడిగా ఈ ప్రాంతంలో నాకు గుర్తింపు ఉంది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని స్థానిక ప్రజాప్రతినిధి కక్ష కట్టి వేధిస్తున్నాడు. గత నెలలో సునీత నిర్వహించిన సామూహిక వివాహాలకు హాజరయ్యాను. ఈ విషయంలో వారు మరింత కక్ష పెంచుకున్నారు. అదే రోజు నా ద్విచక్ర వాహనాన్ని వారు ధ్వంసం చేశారు. దీనిపై నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. ప్రజాప్రతినిధి ఒత్తిళ్ల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోలేదు. దీనిపై మరింత కక్ష పెంచుకున్న వారు ఆదివారం రాత్రి మా ఇంటి గుమ్మం ఎదుట పెట్రోల్ పోసి నిప్పంటించారు. విషయాన్ని గుర్తించి, వెంటనే మంటలు ఆర్పివేశాం. ప్రధాన ద్వారం పాక్షికంగా కాలింది. ఇంటి బయట ఉన్న వస్తువులు కాలిపోయాయి.’ అంటూ సురేష్‌నాయుడు వివరించారు. ఘటనపై పలువురిపై బాధితుడి ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ భాస్కరగౌడ తెలిపారు.
పరిటాల అనుచరుడి ఇంటిపై తమ్ముళ్ల దాడి
Published Tue, May 3 2016 11:05 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement