నమ్మి మోసపోయాను | Believing is my fault | Sakshi
Sakshi News home page

నమ్మి మోసపోయాను

Published Mon, May 11 2015 3:50 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

Believing is my fault

రుద్రవరం : మస్తాన్‌వలి తనను నమ్మించి మోసం చేశాడని ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితురాలైన సినీనటి నీతూ అగర్వాల్ స్పష్టం చేశారు. అరెస్టయిన ఆమె ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ప్రతి ఆదివారం రుద్రవరం పోలీసుస్టేషన్‌లో సంతకం చేయాల్సి ఉంది. ఆమేరకు ఆదివారం ఇక్కడికి వచ్చారు. స్టేషన్‌లో సంతకం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సినీ పరిశ్రమకు ఎర్రచందనం అక్రమ రవాణాకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

ఎర్రచందనం స్మగ్లరు అయిన మస్తాన్ వలి తనను నమ్మించి మోసం చేశాడన్నారు. ప్రేమించినట్లు నటించి తన బ్యాంక్ అకౌంట్ నుంచి స్మగ్లర్ల అకౌంట్‌కు డబ్బులు డ్రా చేయించాడని తెలియజేశారు. ఇందులో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా నీతూ అగర్వాల్ రుద్రవరం పోలీసు స్టేషన్‌కు వచ్చారని తెలుసుకున్న యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో జనం స్టేషన్‌కు చేరుకున్నారు.  

 ఎర్రచందనం కేసులో 12 మంది నిందితులు..
 పిబ్రవరి 3వ తేదీన ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితుడుగా మస్తాన్ వలి, అతడి తమ్ముడు బాబావలితోపాటు డ్రైవర్ మహ్మద్‌వలి, బాల నాయక్, శంకర్ నాయక్, తిరుపాల్ నాయక్, నరసింహనాయక్, లక్ష్మణ్ నాయక్, నీతూ అగర్వాల్‌ను అదుపులోనికి తీసుకున్నామని ఎస్‌ఐ హరినాథరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణానికి చెందిన అటో ఓనర్ సుబ్బయ్య, మస్తాన్ వాహనం మాజీ డ్రైవర్ హరితోపాటు ఎర్రచందనం దుంగలను విక్రయించిన అహోబిలం గ్రామానికి చెందిన అంకన్నను అదుపులోకి తీసుకోవాల్సి ఉందన్నారు.  
 
సినీనటి నీతూ అగర్వాల్‌పై దాడి కలకలం
 శిరివెళ్ల: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు సినీనటి నీతూ అగర్వాల్‌పై ఆదివారం శిరివెళ్లలో దాడి జరిగిందన్న వార్త కలకలం రేపింది.  కండిషన్ బెయిల్‌పై ఉన్న నీతూ ప్రతి ఆదివారం రుద్రవరం స్టేషన్‌లో సంతకం చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆదివారం నీతూ తన లాయర్‌తో కల్సి ఉదయం రుద్రవరం స్టేషన్‌లో సంతకం చేసింది. తిరిగి శిరివెళ్ల మీదుగా నంద్యాల వైపు కారులో వెళ్తుండంగా శిరివెళ్ల మెట్ట వద్ద ఉన్న కాశిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద నంద్యాలకు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్ డ్రైవర్ నాగరాజు వచ్చి నీతూ కారు ఆపారు. అప్పు విషయంపై సినీనటి, డ్రైవర్ మద్య వివాదం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ విషయంపై సినీనటి వెంటనే స్థానిక పోలీస్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేసింది. అయితే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. అందుకు ఆమె అంగీకరించలేదు. ప్రతి ఆదివారం స్టేషన్‌లో సంతకం చేయాల్సి ఉందని సినీనటి అయినందున మార్గమధ్యంలో ఇబ్బంది ఉందని పోలీసులకు తెలియజేశారు. రక్షణ కల్పించాలని కోరి వెళ్లిపోయారు.

కాగా నటి, డ్రైవర్ మధ్య ఉన్న అప్పు విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయంపై సీఐ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతు ఆమెపై ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం చేశారు. డ్రైవర్‌కు నటి రూ. 5 వేల అప్పు ఉందని ఆ విషయంపై డ్రైవర్ కారు ఆపి అడిగారన్నారు. అయినా డ్రైవర్‌ను పిలిపించి విచారణ జరుపుతామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement