
ప్రజాసంకల్పయాత్ర బృందం: జిల్లాలో 26 మండలాల్లో కరువు ఏర్పడటానికి టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా నియోజకవర్గంలోని పార్వతీపురం మండలం కోటవానివలస వద్ద ఆయన ఆదివారం మాట్లాడారు. జిల్లాలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోవటంతోనే 26 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాం లోనే తోటపల్లి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయితే, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మిగిలిన పది శాతం పనులు పూర్తి చేయలేకపోయిందన్నారు. తోటపల్లి కాలువ పనులు పూర్తికాకపోవటంతో రణస్థలం, చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాలకు సాగునీరు అందటం లేదన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో చెరకు రైతులు బకాయిలు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే సమస్యలు తీరుతాయని, సంక్షేమ పాలన ప్రజలకు అందుతుందన్నారు. ప్రజా సంకల్పయాత్ర 300 రోజులు పూర్తి చేసుకుని జిల్లాలో జరిగిన ఎనిమిది బహిరంగ సభలు విజయవంతమయ్యాయన్నారు.