బినామీ రుణాలపై విచారణ
పార్వతీపురం/గరుగుబిల్లి : గరుగుబిల్లి మండలంలోని రావివలస పీఏసీఎస్‌లో జరిగిన బినామీ రుణాలపై మంగళవారం పార్వతీపురం డివిజన్ కో- ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రారు పి. చిన్నయ్య నేతృత్వంలో అధికారుల బృందం విచారణ చేపట్టింది. సహకార సంఘం చట్టం సెక్షన్ 51 ప్రకా రం ‘రుణగ్రస్తుల విచారణ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 480 మంది బినామీలుగా గుర్తించిన రైతులకు ఈనెల 16,17,18 తేదీల్లో హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. అందులో భా గంగా మంగళవారం 120 మందికి సమన్లు జారీ చేయ గా, 101 మంది విచారణకు హాజరయ్యారు. కమిటీ ముందు హాజరైన 101 మంది తాము రుణం తీసుకోలేదని, తమకు పీఏసీఎస్ ముఖం కూడా తెలియదని చెప్పారు.
11 కాలమ్స్‌కు సంబంధించిన ప్రొ ఫార్మాలో సమాచారం సేకరించి తమతో సంతకాలు చేయించుకున్నట్టు తెలిపారు. కాగా పీఏసీఎస్ పరిధిలో 11 వేలకు పైగా రైతులుండగా, అందులో 4,485 మంది రైతులు రుణం తీసుకున్నట్టు రికార్డులు చూపిస్తున్నాయి. దీంతో పాటు 2009 నాటికి దీని వ్యాపార లావాదేవీలు సు మారు రూ. 9 కోట్లు కాగా, ప్రస్తుతం సుమారు రూ. 18.20 కోట్లకు పెరిగింది. అలాగే బృందం బహిరంగ విచారణ చేపట్టకుండా కార్యాలయంలో విచారణ చేయ డం పట్ల బాధితులు తమకు న్యాయం జరగదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా బుధ, గురువారాల్లో కూడా విచారణ చేపట్టిన, అనంతరం ఉన్నతాధికారుల కు నివేదిక అందజేస్తామని బృందం నాయకులు పి. చిన్నయ్య తెలిపారు.
రావివలసలో ఉద్రిక్తత
రావివలసలో ఉద్రిక్తత నెలకొంది. మంగళవారం సమ న్లు జారీ చేసిన వారికి అధికారులు విచారణ చేపట్టడం తో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నా యి. దీంతో బుధ, గురువారాల్లో జరగాల్సిన విచారణ లో కూడా బాధితులు ఆందోళన చేపట్టే అవకాశాలు లేకపోలేదు. తమ గ్రామంలోని పీఏసీఎస్‌లో జరిగిన అక్రమాలపై మంగళవారం జరిగిన విచారణను పలు వార్తా ఛానెళ్లు కవర్ చేశాయి. అయితే ఆ వార్తల ప్రసారాన్ని గ్రామస్తులు తిలకిస్తారని, వార్తలు చూసిన వారు చైత న్యవంతులవుతారన్న ఉద్ధేశ్యంతో వీరఘ ట్టం నుంచి ఆ గ్రామానికి వచ్చే కేబుల్ (ఓఎఫ్‌సి)ని కట్ చేసి న్యూస్ ఛానెళ్లు రాకుండా చేశారు. ఈ విషయమై కేబుల్ ఆపరేటర్ నగిరెడ్డి శ్రీహరినాయుడు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తమ గ్రామానికి వస్తున్న కేబుల్ (ఓఎఫ్‌సి)ని వీరఘట్టం- కడకెళ్ల గ్రామానికి మధ్యలో ఎవరో కట్ చేశారన్నారు.
మేమెలా బతికేది...?
రావివలస పీఏసీఎస్ లో బినామీ రుణాలు బాధితులను భోరున ఏడిపిస్తున్నాయి. జీవితాంతం కష్టించినా రూ.10 వేలు ముఖం చూడని నిరుపేదలకు సైతం లక్షలు అప్పులున్నట్టు సమన్లు పంపిణీ చేయడంతో వాటిని చూసి బాధితులంతా బావురుమన్నారు. ఏమి చేయా లో...? ఎవరికి చెప్పుకోవాలో తెలియక...అంతా రోధస్తూ...మంగళవారం అధికారుల బృందం చేపట్టిన సహకార సంఘం చట్టం సెక్షన్ 51 ప్రకారం జరిపిన ‘రుణగ్రహీతల విచారణ’లో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గ్రామానికి చెందిన రజక వృత్తితో జీవనం సాగిస్తున్న గుమ్మల లక్ష్మణ తనకు అందిన సమన్లు పట్టుకొని మేమెలా బతి కేది...అప్పులెలా తీర్చాలంటూ...రోధించారు.