ప్రేమ పరుగు..
తొలివలపు చాలా చిత్రమైంది.. అది ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ పుడుతుందో తెలియదు.. ఎలా పెరుగుతుందో అర్ధమే కాదు. సాన్నిహిత్యం ఎద తలుపు తడితే, సారూప్యత చెలిమికి స్వాగతం పలుకుతుంది. అది వలపు మలుపు తిరుగుతుంది. కొందర్ని పాట కలుపుతుంది. మరికొందర్ని సాహిత్యం చేరువ చేస్తుంది. వాళ్లిద్దర్నీ మాత్రం పరుగు దగ్గర చేసింది. అథ్లెటిక్స్ అంటే తరగని ఇష్టం ఆకర్షణకు మూలమైంది. అదే పెళ్లిపందిరికి దారి తీసింది. ఒకరి అడుగులో ఒకరుగా సాగించే జర్నీకి నాంది పలికింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్లది ఒకటే మాట.. ఒకటే బాట. పోర్ట్ జింఖానా మైదానంలో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు అదే సంస్థలో సహ ఉద్యోగులుగా, జీవిత భాగస్వాములుగా కళకళలాడుతోంది. నువ్వు, నేనన్న తేడా లేకుండా, అరమరికలు లేకుండా సాగే దాంపత్యంలో ఆనందాన్ని ఒకే మాటగా చెప్పే పోర్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ చిన్నం బెనర్జీబాబు, అదే సంస్థలో సీనియర్ అసిస్టెంట్ బెర్నడెట్‌ల అనుబంధమే ఈ వారం 'యూ అండ్ ఐ'
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.. అని పాడుకోవడానికి ఏలూరుకు చెందిన బెనర్జీబాబుకు, విశాఖపట్నంలోని పోర్ట్ క్వార్టర్స్‌కు చెందిన బెర్నడెట్‌కు అస్సలు తీరిక లేదు. అలా అని ఇద్దరి మధ్య తేడాలు, గొడవలు ఉన్నాయని కాదు. ఇద్దరికీ ఒకటే ఇష్టం.. అది అథ్లెటిక్స్. పరుగు పందాలు, చాంపియన్‌షిప్‌లు, పతకాలు, రికార్డులు.. ఇవే ఇద్దరి ఆలోచనలు. దాంతో వాళ్లకు వేరే ఆలోచన ఉండేది కాదు... ఇదంతా సుమారు మూడున్నర దశాబ్దాల కిందటి మాట.
కానీ ఇప్పుడు.. ఇద్దరిదీ ఒకటే మాట. ‘ఆవిడ మంచి అథ్లెట్.. అంతే మంచి గృహిణి, మంచి తల్లి’ అని ఆయన కితాబిస్తే.. ‘నా మనసు ఎరిగిన వ్యక్తి.. నా అభివృద్ధికి దోహదపడ్డారు. అర్థం చేసుకుని, అండగా నిలిచారు.’ అంటారు బెర్నడెట్. ముప్ఫై ఏళ్ల వైవాహిక జీవితమనే ట్రాక్ మీద తమ ఇద్దరి రన్నింగ్ రేస్ సాఫీగా సాగిపోతోందంటే పరస్పర అవగాహన, గౌరవం, నమ్మకమే కారణమని బెర్నడెట్ అంటే చిర్నవ్వుతోనే ఔనంటారు బెనర్జీబాబు.
బెనర్జీ: మాది స్పోర్ట్స్‌కు, అథ్లెటిక్స్‌కు పేరు పడ్డ ఏలూరు. చిన్నప్పటి నుంచి పరుగుతో పరిచయం ఉంది. అది తప్ప వేరే ప్రపంచం తెలీదు. స్కూల్ లెవెల్‌లో గ్రిగ్ చాంపియన్‌ని. 10సార్లు నేషనల్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రిప్రజెంట్ చేశాను. 1978లో స్పోర్ట్స్ కోటాలో వైజాగ్ పోర్టుట్రస్ట్‌లో క్లర్క్‌గా ఉద్యోగం వచ్చింది. అప్పుడూ పోటీల్లో పాల్గొనే వాడిని. ప్రాక్టీస్ తీవ్రంగా చేసేవాడిని. ఇరవై నాలుగ్గంటలూ మరో ధ్యాస ఉండేది కాదు. ఆటలకు పోర్ట్ జింఖానా గ్రౌండ్ కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. చాలా మంది అక్కడికి వచ్చేవారు. అలా అథ్లెట్‌గా ప్రాక్టీస్ కోసం వచ్చినప్పుడు బెర్నడెట్‌ని తొలిసారి చూశాను.
బెర్నడెట్ : మాది వైజాగే. మా నాన్నగారు పోర్టు ఉద్యోగి. పోర్ట్ కాథలిక్ గర్ల్స్ హైస్కూల్‌లో చదివాను. నేను టెన్త్‌లో ఉండగా హ్యాండ్‌బాల్ కోచింగ్ క్యాంప్ నిర్వహించారు. అక్కడ స్టేట్ లెవెల్‌కు సెలక్ట్ అయ్యాను. 100మీ., 200మీ. పరుగుపందాల్లో స్టేట్ చాంప్‌ను అయ్యాను. వరుసగా పతకాలు రావడంతో అథ్లెటిక్స్ మీద ఆసక్తి కలిగింది. హ్యాండ్‌బాల్, పవర్‌లిఫ్టింగ్.. ఒకటేమిటి.. స్పోర్ట్స్ అంటే ప్రాణం పెట్టేసేదాన్ని.
బెనర్జీ: పోర్టులో అథెటిక్స్‌లో పాల్గొనే ఉద్యోగులం 20 మంది జింఖానా గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేసేవాళ్లం. 1980లో అక్కడికి నలుగురైదుగురు అమ్మాయిలు ప్రాక్టీస్ కోసం వచ్చేవారు. వారిని ఒక అమ్మాయి లీడ్ చేసేది. ఆమే బెర్నడెట్. అలా పోర్టు గ్రౌండ్‌లో మేము మొదటిసారి కలుసుకున్నాం.
బెర్నడెట్ : అప్పట్లో కోచ్‌లు లేరు. సీనియర్లే మమ్మల్ని గైడ్ చేసేవారు. జింఖానా గ్రౌండ్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బెనర్జీ గైడ్ చేసేవారు. ఆయన మంచి అథ్లెట్‌గా తెలుసు. అమ్మాయిల్లో నేనే ఫస్ట్‌గా ఉండేదాన్ని. దాంతో నన్ను మరింతగా ప్రోత్సహించేవారు. అబ్బాయిలతో పోటీ పడి పరుగు తీసేదాన్ని. వాళ్లతో క్రాస్‌కంట్రీకి కూడా వెళ్లేదాన్ని.
బెనర్జీ: అందరిలోనూ బెర్నడెట్ యాక్టివ్‌గా ఉండేది. ఎంత దూరమైనా మాతో విసుగు లేకుండా ప్రాక్టీస్ చేసేది. బాలికల విభాగంలో తను పాల్గొనని పోటీ లేదు. గెలవని పతకం లేదు. ఎన్‌సీసీలో సీనియర్ అండర్ ఆఫీసర్‌గా రిపబ్లిక్ డే పెరేడ్‌లో పాల్గొంది. చురుగ్గా ఉండేది. అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, పవర్‌లిఫ్టింగ్.. చాలా బిజీగా ఉండేది. స్టేట్ చాంపియన్. నేషనల్స్‌లో పాల్గొనేది. చొరవ, ధైర్యం తన సొంతం. వాళ్లమ్మగారు ఆంగ్లో ఇండియన్. దాంతో ఇంగ్లిష్ అదరగొట్టేసేది. దాంతో తనంటే ఇష్టం పెరిగింది.
బెర్నడెట్ : ఏవీఎన్‌లో బీకామ్ అయిన తర్వాత పోర్టులో ఉద్యోగం వచ్చింది. 1984 ఏప్రిల్‌లో ఆయన పెళ్లి ప్రపోజల్ చేశారు. అప్పటికే నాలుగైదేళ్లుగా పరిచయం ఉంది. మంచి వ్యక్తి. ఆయనా అథ్లెట్ కావడంతో ఓకే అనేశా.
బెనర్జీ: మా పెద్దలూ కాదనలేదు. 1984 జూన్‌లో మా వివాహం జరిగింది. తర్వాత ఇద్దరం అగర్తలాలోని నేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఏపీ తరపున పాల్గొన్నాం. కొంతకాలానికి నేను స్పోర్ట్స్ ఆఫీసర్ అయ్యాను. పెళ్లికి ముందు ఇద్దరం పోటాపోటీగా ఉండేవాళ్లం. పెళ్లయిన తర్వాత కూడా పోటీ ఉండేది. అవగాహన కూడా అదే స్థాయిలో ఉండేది. పెళ్లయిన కొత్తలో మా మాటలన్నీ పోటీలు, పార్టిసిపేషన్..ఇలా అథ్లెటిక్స్ చుట్టూనే ఉండేవి.
బెర్నడెట్ : పెళ్లయిన తర్వాత అమ్మవాళ్ల క్వార్టర్స్ మాకు దగ్గరగానే ఉండడంతో ఇబ్బంది ఉండేది కాదు. పిల్లల్ని అమ్మ, మా అత్తగారు చూసుకునేవారు. పెళ్లి తర్వాత కూడా పోటీల్లో పాల్గొన్నా!
బెనర్జీ: ఎంత మంచి స్పోర్ట్స్ పర్సనో అంత మంచి ఇల్లాలు. ఇంటి పనులన్నీ ఒంటి చేత్తో చేసేస్తుంది. ఇంటి నిర్వహణ, పిల్లల పెంపకం.. అన్నింటిలోనూ ఆమె పాత్రే ఎక్కువ. కూరగాయలు తెచ్చుకోవడంతో సహా అన్నీ తనే చేసుకుంటుంది.
బెర్నడెట్ : ఈయన ఉదయం ఆరు గంటలకు కోచింగ్‌కు వెళ్లిపోతారు. 8.30కి వచ్చి మళ్లీ డ్యూటీకి వెళతారు. సాయంత్రం కూడా పిల్లలకు కోచింగ్‌తోనే ఆయనకు సరిపోతుంది. దాంతో అన్నీ నేనే చూసుకుంటాను. తను చాలా సపోర్ట్‌గా ఉంటారు. అందువల్లే నేను ఉద్యోగిగా, గృహిణిగానే కాదు.. నేషనల్ మీట్స్‌కు ఎనౌన్సర్, కంపీరర్‌గా, యూనియన్‌లో కీలక సభ్యురాలిగా, పోర్టులో విమెన్ కంప్లయింట్స్ సెల్ కన్వీనర్‌గా, ఇంటర్నేషనల్ మీట్స్‌లో టెక్నికల్ అఫీషియల్‌గా కొనసాగగలుగుతున్నాను.
బెనర్జీ: మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడు ప్రేమ్‌కుమార్ మెరైన్ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. చిన్నవాడు ప్రణీత్ కుమార్ బీటెక్ తర్వాత ఎంబీఏ చేస్తున్నాడు. ప్రేమ్ బుచ్చిబాబు క్రికెట్ టోర్నీలో ఆడాడు. ప్రణీత్ రంజీ ప్రాబబుల్స్ వరకు వెళ్లాడు.
బెనర్జీ: బెర్నడెట్ అథ్లెటిక్ చాంపియన్. గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అయినా గర్వం మచ్చుకైనా కనిపించదు. చాలా అండర్‌స్టాండింగ్‌గా ఉంటుంది. నామాటకు ఎంతో విలువ ఇస్తుంది.
బెర్నడెట్ : బయట బాధ్యతల ఒత్తిడితో కోపం తెచ్చుకున్నా కాసేపటికే నా దారిలోకి వచ్చేస్తారు. ఎలాగూ నామాటే ఆయన మాట కదా. ఏదన్నా ఇద్దరిదీ ఒకటే మాట. ఒకటే బాట.