జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అవినీతికి అడ్డాలుగా మారిపోయాయి. ఇటు అధికారులు, అటు మిల్లర్లు కుమ్మక్కై ప్రభుత్వ బొక్కసానికి పెద్దకన్నమే పెడుతున్నారు. నిన్న ట్రక్‌షీట్‌ల వ్యవహారం వెలుగుచూడగా, ఇప్పుడు కౌలురైతులకు ఇచ్చే సాగు ధ్రువీకరణ పత్రాలూ మిల్లర్ల చేతికి వెళ్లినట్టు సమాచారం. వాటి ఆధారంగా కొందరు మిల్లర్లు కౌలు రైతుల పేరుతో తమ జేబులు నింపుకొంటున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ధాన్యం కొనుగోలు వ్యవహరంలో రోజుకో కొత్త అవినీతి వ్యవహారం బయటపడుతోంది. ట్రక్‌షీట్‌ల మాయాజాలంతో కోట్లాది రూపాయలు పక్కదారి పట్టినట్టు ఆరోపణలు రాగా, కౌలు రైతుల ముసుగులోనూ అదే స్థాయిలో అవినీతి జరుగుతోంది. ఇదంతా చూస్తుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తుందన్న సందేహం రాకమానదు. ట్రక్‌షీట్‌ల భాగోతాన్ని ఇప్పటికే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ధాన్యం తెచ్చిన రైతులకు మాత్రమే కొనుగోలు కేంద్రాల సిబ్బంది ఇవ్వవల్సిన ట్రక్‌షీటులు, నేరుగా మిల్లర్ల చేతికి వెళ్లాయి.
ఈ ట్రక్‌షీట్ ప్రక్రియకొచ్చే ముందు మరో భాగోతం చోటుచేసుకుంటుంది. సాధారణంగా రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చేటప్పుడు కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ఐకేపీ, రెవెన్యూ, సివిల్‌సప్లై సిబ్బంది ట్రక్ షీట్‌ను రాస్తారు. ట్రక్ షీట్ ప్రకారం ధాన్యాన్ని సంబంధిత మిల్లుకు కేటాయిస్తారు. ఆ మిల్లు యజమాని ధాన్యాన్ని అన్‌లోడ్‌చేసుకుని ఎకనాలెడ్జ్‌మెంట్ (ఏసీకే) ఇస్తారు. దీంతో పాటు ట్రక్‌షీట్‌ను పట్టాదారు పాసు పుస్తకం రశీదును, బ్యాంకు అకౌంట్ పాస్‌బుక్‌ను, ఆధార్ కార్డును జిరాక్సులు తీసుకుని, కొనుగోలు చేసిన లోడుల వివరాలను కొనుగోలు కేంద్రం సిబ్బంది జిల్లా కార్యాలయానికి తీసుకువెళితే జిల్లా మేనేజర్ అక్కడ బల్క్‌గా చెక్ రాసి బ్యాంకుకు ఇస్తే బ్యాంకులో రైతుల ఖాతాలకు సొమ్ము జమ అవుతుంది.
అదే కౌలు రైతులైతే భూమికి సంబంధించిన అసలు యజమాని పట్టాదారు పుస్తకం జిరాక్స్‌తో పాటు బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, రేషన్‌కార్డు జిరాక్స్‌లను అందజేయాల్సి ఉంది. వాటితో పాటు వీఆర్‌ఓ సంతకం చేసిన సాగు ధ్రువీకరణ పత్రాన్ని కొనుగోలు కేంద్రానికి ఇవ్వవల్సి ఉంది. దాన్ని ఆధారంగా చేసుకుని సదరు కౌలు రైతులకు కొనుగోలు కేంద్రాలు ట్రక్‌షీట్లు జారీ చేస్తాయి. తదననుగుణంగా సరఫరా చేసిన సరుకు మేరకు నిధులు జమ చేస్తారు. అయితే, కౌలు రైతుల ముసుగులో మిల్లర్లు పెద్ద మోసానికి దిగారన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. తమ వద్ద ఉన్న కొందరు రైతులకు చెందిన పట్టాదారు పుస్తకాల జిరాక్సు కాపీలను తీసుకుని వాటికి పలుకుబడితో గాని, కాసులు విసిరిగాని చేజిక్కించుకుంటున్న సాగు ధ్రువీకరణ పత్రాలను జోడిస్తున్నారు.
ట్రక్‌షీట్ల మాయాజాలంతో ప్రభుత్వాన్ని ఎలాగైతే బురిడి కొట్టిస్తున్నారో, అదే విధంగా ఈ సాగు ధ్రువీకరణ పత్రాల్ని పట్టుకుని ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారు. పూరించకుండానే ఆ పత్రాలను కొందరు వీఆర్వోలు మిల్లర్ల చేతిలో పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇలా చేయడం వెనుక సంబంధిత అధికారుల హస్తం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విచ్చలవిడిగా జారీ చేస్తున్న సాగు ధ్రువీకరణ పత్రాలతో మిల్లర్ల పంట పండుతోంది. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు చెలరేగిపోతున్నారు.
పలువురు వీఆర్‌ఓలు గుడ్డిగా ఇచ్చేసిన సాగు ధ్రువీకరణ పత్రాలను జత చేసి, తమ బంధువులను కౌలు రైతులుగా చూపించి, వారికి సంబంధించిన బ్యాంకు అకౌంట్లు, ఆధార్ కార్డు జిరాక్సు పత్రాలను జత చేస్తున్నారు. ఈ వివరాలనే తమ వద్ద ఉన్న ట్రక్ షీట్లతో నింపి బిల్లులను పంపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిని పరిశీలించకుండానే అన్‌లైన్ చేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఈ విధంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులు గోల్‌మాల్ అయ్యాయనే ఆరోపణలు వినిపించినా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
పెద్దతంతే...
ట్రక్‌షీట్లు, సాగు ధ్రువీకరణ పత్రాల మాయ వెనక పెద్ద తంతే నడుస్తోంది. ధాన్యం కొనుగోలు చేసినట్టు, అవి మిల్లర్లకు చేరినట్టు, వాటిని మరపట్టి ఇస్తున్నట్టు చూపిస్తున్నప్పటికీ లోపాయికారీగా మరో తతంగం కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకొచ్చిన పీడీఎస్(కిలో రూపాయి బియ్యం) బియ్యంలో చాలా వరకు బహిరంగ మార్కెట్‌లో విక్రయాలు జరుగుతున్నాయి. వాటినే వ్యాపారుల ద్వారా కొందరు మిల్లర్లు సేకరించి, కొనుగోలు కేంద్రం నుంచి వచ్చిన ధాన్యానికి బదులగా కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ఇచ్చేస్తున్నట్టు వాదనలు ఉన్నాయి. దీనికి ఊతమిచ్చినట్టు సాక్షాత్తు కలెక్టర్, జేసీల సమక్షంలో మంగళవారం జరిగిన ఆహార సలహా సంఘం సమావేశంలో మిల్లర్ల చేస్తున్న రీసైక్లింగ్ వ్యవహారాన్ని కొందరు ప్రస్తావించారు.
ధాన్యం కొనుగోలు, ట్రక్‌షీట్,
పత్రాల మాటున పచ్చి మోసం!
Published Thu, Feb 26 2015 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement
Advertisement