విజయనగరం ఫోర్ట్: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎన్నో కష్టనష్టాలకోర్చి నిర్వహించిన గ్రామైక్య సంఘాలకు, కూలీలకు ఇప్పటివరకూ కమీషన్లు చెల్లించకపోవడం పట్ల జెడ్పీటీసీలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ 1, 2, 4, 7 స్థాయీ సంఘాల సమావేశం జెడ్పీ చైర్‌పర్సన్ శోభస్వాతిరాణి అధ్యక్షతన, 3, 5, 6 స్థాయీసంఘాలు వైస్‌చైర్‌పర్సన్ బలగం కృష్ణమూర్తినాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగాయి. ఈ సందర్భంగా జామి జెడ్పీటీసీ బండారు పెదబాబు మాట్లాడుతూ అసలు ధాన్యం కొనుగోలుకు సంబంధించి మహిళలకు, కూలీలకు ఎంత చెల్లించాలని ఏపీడీ సుధాకర్‌ను ప్రశ్నించారు.
రూ.7.50 కోట్లు మంజూరయిందనీ, వీటిని జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య, గ్రామైక్య సంఘాలకు అందజేస్తామని ఆయన సమాధానమిచ్చారు. పెదబాబు కలుగజేసుకుని జిల్లాసమాఖ్య, మండల సమాఖ్యలు ఎప్పుడో లాప్స్ అయిపోయాయని, కష్టపడుతున్న మహిళలకే డబ్బులు ఇవ్వాలని, నిధులు వచ్చినా ఇంతవరకు చెల్లించకపోవడం ఏంటని , తక్షణమే డబ్బులు చెల్లించకపోతే లోకాయుక్తలో కేసు వేస్తానని హెచ్చరించారు. బొండపల్లి జెడ్పీటీసీ బండారు బాలాజీ మాట్లాడుతూ స్వావలంబన రుణాల కోసం మహిళలు నుంచి డబ్బులు కట్టించుకుని, వారికి రుణాలు ఇవ్వలేదని అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
ఎల్.కోట జెడ్పీటీసీ కరెడ్ల ఈశ్వరరావు పింఛన్లు సక్రమంగా రాకపోవడంపైనా... మక్కువ జెడ్పీటీసీ శ్రీధర్ ఇసుక లేకున్నా రీచ్‌లకు ఎలా వేలం నిర్వహించారనీ, పూసపాటిరేగ జెడ్పీటీసీ ఆకిరి ప్రసాద్‌రావు ఎన్‌ఆర్‌జీఎస్ పనులు మంజూరులో హడావుడి ఎందుకని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయుడు, మీసాల గీత, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వేణుగోపాల్, జెడ్పీ సీఈఓ గనియా రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.
గ్రామైక్య సంఘాలకు కమీషన్లు ఇచ్చారా?
Published Wed, Feb 10 2016 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM
Advertisement