విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కితాబు ఇచ్చింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీల్లో పౌరసరఫరాల శాఖ క్వాలిటీ కంట్రోల్ రాష్ట్ర మేనేజర్ జీసీ మల్లారెడ్డి,ఏజీఎం పి.సుధాకరరావు, టెక్నికల్ అధికారి ఏఆర్‌ఎన్ బాబులు పాల్గొని తాము సందర్శించిన ప్రాంతాల్లో గుర్తించిన అంశాలు, లోటుపాట్లను వివరిస్తూ ఆ శాఖ ఎం.డి.కి నివేదిక ఇచ్చారు. దీనిపై సివిల్ సప్లైస్ ఎం.డి. పేరిట జిల్లాకు నివేదిక చేరింది. ఇందులో గుర్తించిన ప్రకారం..జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిబంధనలు పాటిస్తున్నాయని రిపోర్టు ఇచ్చారు. సరిపడా సిబ్బందితో ఈ కేంద్రాలు నడుస్తున్నాయని రాశారు. గోనె సంచులు పంపిణీ చేయడంలోనూ, తూకం పరికరాల పంపిణీ చేయడంతో పాటు అవసరమైన కేంద్రాల్లో తేమ యంత్రాలను కూడా ఏర్పాటు చేసినట్టు రిపోర్టులో పేర్కొన్నారు.
అయితే జిల్లాలో సమస్యలను కూడా చెప్పుకొచ్చారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని కూలీలు తమ కూలి డబ్బులు త్వరగా ఇవ్వాలని కోరినట్టు రిపోర్టులో పేర్కొన్నారు. కూలీలకు డబ్బులు త్వరగా ఇస్తే కేంద్రాలు జోరుగా నడుస్తాయని కూలీలే చెప్పినట్టు రిపోర్టులో రాశారు. శ్రీకాకుళం జిల్లాలో 40 కిలోల బస్తాలకు బదులుగా 70 నుంచి 80 కిలోల బస్తాలను వేస్తున్నారన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఇంకా పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. కొనుగోలు కేంద్రాలకు పంపిణీ చేసిన తేమ యంత్రాలు నాణ్యతలోపించాయని తేల్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న ఐకేపీ మహిళలు, పీఏసీఎస్ సిబ్బందికి ఇంకా శిక్షణ అవసరమని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకువచ్చిన దగ్గరనుంచి బ్యాగులు కట్టడం, తరలించడం, మిల్లులకు అప్పగించడం వంటి విషయాల్లో ఇంకా అస్పష్ట విధానాన్ని అవలంబిస్తున్నారని, దీనిని మార్చుకోవాల్సి ఉందని రిపోర్టు ఇచ్చారు. ఈ రెండు జిల్లాల్లో పర్యటించిన కమిటీ ఇచ్చిన సూచనలను అమలు చేయాలని ఆ శాఖ ఎం.డి. ఆయా జిల్లాలోని పౌరసరఫరాల కలెక్టర్లకు సూచించారు.
రెండు జిల్లాల ధాన్యం శాంపిళ్ల రిపోర్టు :
రెండు జిల్లాల్లో పర్యటించిన తనిఖీ బృందం అధికారులు శ్రీకాకుళంలో ఏడు కొనుగోలు కేంద్రాలు, విజయనగరంలో ఐదు కొను గోలు కేంద్రాలనుంచి పది చొప్పున శాంపిళ్లను సేకరించి వాటిని ప్రయోగశాలలో పరీక్షించి వాటి నాణ్యత నివేదికను పంపించారు. దీని ప్రకారం విజయనగరం జిల్లాలోని ధాన్యం నాణ్యత ఫరవాలేదని , శ్రీకాకుళంలోని నాణ్యత తక్కువ ఉందని నివేదిక ఇచ్చారు. రెండు జిల్లాల్లోనూ హుద్‌హుద్ తుపాను ప్రభావం ఉందని తెలిపారు. తాము శాంపిల్స్ తీసుకున్న రైతుల పేర్లు, అడ్రస్‌లతో పాటు వారిచ్చిన ధాన్యంలో తేమ, రాళ్లు, చెత్త, ధూళి, నూక శాతం వంటి వివరాలను నివేదించారు.
విజయనగరం భేష్
Published Fri, Jan 30 2015 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM
Advertisement
Advertisement