- 24న చెల్లించినట్లు రికార్డులు సమర్పించిన డీసీసీబీ జీఎం
- రూ.లక్షకుపైగా తేడా వచ్చిందంటున్న సహకార శాఖ ఉద్యోగులు
- రెండు రోజుల్లో పూర్తి వివరాలు సేకరించాలి
- జెడ్పీ అధికారులను ఆదేశించిన విచారణాధికారి వెంకటేశ్వర్లు
జిల్లాపరిషత్ : సహకార శాఖలో ఉద్యోగ విరమణ పొందిన వారి బెనిఫిట్స్ చెల్లింపుల్లో అవకతవకలపై జిల్లాపరిషత్ ఇన్‌చార్జ్ సీఈఓ వాసం వెంకటేశ్వర్లు గురువారం రెండో దఫా విచారణ చేపట్టారు. జెడ్పీలో జరిగిన విచారణకు డీసీసీబీ జీఎం సురేందర్ హాజరై 30 మంది ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్‌ను 24వ తేదీనే బ్యాంకుల్లో జమ చేసినట్లు తెలిపి... ఇందుకు సంబంధించిన రికార్డులను సీఈఓకు అందజేశారు.
అనంతరం ఆయన వెళ్లిపోగా... ఉద్యోగ విరమణ పొందిన వారితో వెంకటేశ్వర్లు సమావేశమయ్యూరు. డీసీసీబీ జీఎం ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఒక్కొక్కరికి సుమారు రూ.లక్షకు పైగా తేడా వచ్చినట్లు విరమణ పొందిన 30 మంది ఉద్యోగులు సీఈఓ దృష్టికి తీసుకొచ్చారు. 30 శాతం మినహాయింపుతో డబ్బులు తీసుకున్న 38 మంది కూడా ఇదే విషయాన్ని ఆయనకు చెప్పారు. దీంతో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి ఎంత బెనిఫిట్స్ (డ బ్బులు) వచ్చాయి... వారి బాకీ ఉన్న డబ్బులు ఎన్ని మినహాయించారు...
ఇప్పుడు ఎంత ఇవ్వాల్సి ఉంటుందనే వివరాలతో కూడిన ఫార్మాట్‌ను తయారు చేసి డీసీసీబీ అధికారులకు పంపించనున్నట్లు సీఈఓ వెల్లడించారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో వివరాలు తెప్పించాలని జెడ్పీ ఉద్యోగులు నర్సింహరావు, రాంబాబును ఆదేశించారు. త్వరలో విచారణ తేదీని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. కాగా, మళ్లీ విచారణ జరిగే రోజున తమతోపాటు ఒకే సమయంలో జీఎం సురేందర్ హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఈఓ వాసం వెంకటేశ్వర్లును ఉద్యోగ విరమణ పొందినవారు కోరారు.