‘బెంజి’పై రయ్‌..రయ్‌  | Benz Circle Flyover Trial Run Successful In Vijayawada | Sakshi
Sakshi News home page

‘బెంజి’పై రయ్‌..రయ్‌ 

Published Tue, Feb 4 2020 7:15 AM | Last Updated on Tue, Feb 4 2020 7:17 AM

Benz Circle Flyover Trial Run Successful In Vijayawada - Sakshi

ఫ్లై ఓవర్‌పై రాకపోకలు సాగిస్తున్న వాహనాలు

సాక్షి, అమరావతి: బెజవాడ వాసులకు ఊరట! నగరంలో ట్రాఫిక్‌ సమస్యల నుంచి ఉపశమనం కలిగించే బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ దాదాపు అందుబాటులోకి వచ్చింది. రూ.82 కోట్లతో 2.32 కిలోమీటర్ల మేర (అప్రోచ్‌రోడ్లతో సహా) నిర్మించిన ఈ వంతెనపై రాకపోకలు సాగించేందుకు వీలుగా అధికారులు నిర్వహించిన ట్రయల్‌రన్‌ సక్సెస్‌ అయింది. దీంతో ఈ ఫ్లైఓవర్‌పై భారీ వాహనాలను అనుమతించారు. నెల రోజుల క్రితమే పూర్తయిన ఈ వంతెనను కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీతో ప్రారంభించాలని ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ఆయన రాక ఆలస్యం అవుతుండడంతో ఈలోగా ఈ వంతెనపై ట్రయల్‌రన్‌ నిర్వహించి ఏలూరు నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, నగర పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావులు సంబంధిత అధికారులతో కలిసి ఈ ఫ్లైఓవర్‌ను పరిశీలించారు. కొన్ని లోటుపాట్లను గుర్తించారు. వాహనాలు ప్రమాదాలకు గురికాకుండా వంతెన కిరువైపులా రిఫ్లెక్టెడ్‌ లైట్లు, స్క్రూ వంతెన వద్ద స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పటివరకు పగటి పూట మాత్రమే వాహనాలను అనుమతించాలని నిర్ణయించారు. తొలిసారిగా ఈ ఫ్లైఓవర్‌ మీదుగా ఏపీ39–టీహెచ్‌ 9786 నంబరు కొత్త లారీని, ఆ తర్వాత ఇతర వాహనాలను అనుమతించారు. 

ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌.. 
ఈ సందర్భంగా కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వస్తే బెజవాడ వాసుల ట్రాఫిక్‌ ఇబ్బందులు చాలావరకు తీరతాయని చెప్పారు. వచ్చే నెలలో కేంద్రమంత్రి గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఈ వంతెనపై లోపాలను సరిచేశాక పూర్తిస్థాయిలో వాహనాలను అనుమతిస్తామని చెప్పారు. కార్యక్రమంలో జాయింట్‌ సీపీ నాగేంద్రకుమార్, డీసీపీ హర్షవర్థన్, ఎన్‌హెచ్‌ఏఐ పీడీ విద్యాసాగర్, ట్రాన్స్‌కో అధికారులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement