కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజీ విభాగంలో గుండెజబ్బులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. తిరుపతిలోని స్విమ్స్‌లో కార్డియాలజీ వైద్యులుగా విధులు నిర్వహించిన డాక్టర్ సీఎస్ తేజానందనరెడ్డి శుక్రవారం కర్నూలులో విధుల్లో చేరారు. ఆయన ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో శిక్షణ పొందడం వల్ల హృద్రోగులకు ఇకపై ఇక్కడే పీటీసీఏ, బెలూన్‌ప్లాస్టీ, ఫేస్‌మేకర్‌ను అమర్చుకునే వీలుకలిగింది. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందే పేద రోగులకు ఇది ఎంతో మేలు చేస్తుందని కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ పి.చంద్రశేఖర్ చెప్పారు.
శుక్రవారం పాములపాడుకు చెందిన దర్గయ్య అనే వ్యక్తికి డాక్టర్ సీఎస్ తేజానందనరెడ్డి పీటీసీఎల్ విత్ బెలూన్ ప్లాస్టీని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా కార్డియాలజీ విభాగంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ పి.చంద్రశేఖర్ మాట్లాడారు. ఇదే మెడికల్ కాలేజిలో డాక్టర్ సీఎస్ తేజానందనరెడ్డి అభ్యసించారన్నారు. 1998-2003లో ఎంబీబీఎస్, 2005-08లో ఎండీ పూర్తి చేశారన్నారు. నంద్యాలకు చెందిన ఆయన కర్నూలు జిల్లా వాసులకు సేవలందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. త్వరలో కార్డియాలజిస్టు డాక్టర్ చైతన్య కూడా విధుల్లో చేరనున్నట్లు చెప్పారు.
గుండెజబ్బులకు మెరుగైన వైద్యసేవలు
Published Tue, Oct 8 2013 3:55 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM
Advertisement
Advertisement