జునోటిక్ వ్యాధులతో జాగ్రత్త!
అమలాపురం : మానవ జీవితం జంతువులు, పక్షులతో ముడిపడి ఉంది. వాటి పెంపకం ప్రస్తుత సమాజంలో అధికమైంది. కుక్కలు, పిల్లులు, పక్షులు, పశువులను ప్రాణంగా, ఇంట్లో కుటుంబ సభ్యుల్లా చూసుకునేవారు రోజురోజుకీ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో జంతువుల నుంచి సక్రమించే వ్యాధుల(జునోటిక్ వ్యాధులు)పై అందరికీ అవగాహన అవసరం. ఈ వ్యాధుల్లో కుక్కల వల్ల వచ్చేవే ఎక్కువని రాజమండ్రి పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ మోటూరి రామకోటేశ్వరరావు తెలిపారు. మంగళవారం వరల్డ్ డాగ్ డే సందర్భంగా జునోటిక్ వ్యాధుల గురించి ఆయన వివరించారు.
జునోటిక్ వ్యాధులు 250పైనే..
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి వరకు 250 జునోటిక్ వ్యాధులను గుర్తించింది. అందులో 130 సూక్ష్మ జీవుల వల్ల, 60 పరాన్న జీవుల వల్ల మిగిలినవి వైరస్ వల్ల వ్యాపిస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
జునోటిక్ వ్యాధులు రాకుండా పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించాలి. వ్యాధులు సోకిన వాటిని మంద నుంచి వేరు చేసి చికిత్స అందించాలి. అవి ఉండే ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలి. వాటికి సన్నిహితంగా ఉండేవారు వ్యక్తిగత శుభ్రత పాటించాలి. ఆరోగ్య, పశుసంవర్ధక శాఖల అధికారుల సూచనలు తీసుకోవాలి.
రేబిస్ మహమ్మారి :
అధికశాతం కుక్కల వల్ల వచ్చే ప్రాణాంతక వ్యాధి రేబిస్. దీనినే విష్సా, హైడ్రో ఫోబియా అని కూడా అంటారు. ఈ వ్యాధి సోకిన జంతువుల దగ్గరగా ఉండడం వల్ల ఇది మనుషులకూ సంక్రమిస్తుంది. దీనివల్ల పిచ్చి ఎక్కి చనిపోతారు. 80 శాతం కుక్క కరవడం వల్ల, 5 శాతం పిల్లుల వల్ల, 3శాతం నుంచి 4శాతం క్రూర జంతువుల వల్ల, రెండు శాతం ఇతర జంతువుల వల్ల ఈ వ్యాధి వచ్చే ఆస్కారముంది. కుక్కలను, పిల్లులను పెంచుకునేవారు వాటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అవి రేబిస్ బారిన పడతాయి. పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించడంలో నిర్లక్ష్యం తగదు. వీధి కుక్కలతో మరింత అప్రమత్తంగా ఉండాలి.
గుర్తించడానికే ఎక్కువ సమయం
ఈ వ్యాధి మనుషులకు సోకితే లక్షణాలు గుర్తించడానికి రెండు వారాల నుంచి ఎన్నిరోజులైనా పట్టవచ్చు. అదే కుక్కలు, పశువుల్లో అయితే ఐదు నుంచి ఆరు వారాలు పడుతుంది. దీని లక్షణాలు రెండు రకాలుగా ఉంటాయి. జంతువులు విపరీతమైన ఆందోళనగా ఉంటాయి. విచక్షణా రహితంగా కరుస్తుంటాయి. యజమానినీ గుర్తించలేవు. ఆహారం తినవు. రాళ్లు, కర్రలు తినడానికి యత్నిస్తాయి.
గొంతు కండరాలకు పక్షవాతం వచ్చి గొంతు బొంగురపోతుంది. నీటినీ తాగలేవు. ఈ రకం లక్షణాలు పిల్లుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని జంతువుల్లో దవడ కిందకు వేలాడుతుంటుంది. పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. అరవలేవు. కరవలేవు. కుందేళ్లలో ఈరకం లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించాక చికిత్స లేదు. మరణం అనివార్యం.