పిల్లులు, కుక్కలకు ‘దివ్య’దృష్టి!
కుక్కలకు, పిల్లులకు దెయ్యాలు కనిపిస్తాయనీ.. ఆవుకు కొన్ని విషయాలను పసిగట్టే శక్తి ఉంటుందనీ.. అనేక మంది విశ్వసిస్తారు. అయితే పిల్లులకు, కుక్కలకు, ఎలుకలకు నిజంగానే ‘దివ్య’దృష్టి ఉంటుందంటున్నారు సిటీ యూనివర్సిటీ లండన్ శాస్త్రవేత్తలు. మనుషుల కంటికి కనిపించని అతినీల లోహిత కాంతి(యూవీ లైట్)ని సైతం పిల్లులు, కుక్కలు, ఎలుకలు, గబ్బిలాలు, ఇంకా వివిధ క్షీరదాలు చక్కగా చూడగలుగుతాయని వారు తేల్చారు. వెన్నెముక లేని తేనెటీగ వంటి జీవులు, పక్షులు, చేపలు, కొన్ని సరీసృపాలు, ఉభయచరాలు యూవీ కాంతిని చూడగలుగుతాయని గతంలోనే తేలింది.
అయితే యూవీ కాంతిని గ్రహించి ఆ సమాచారాన్ని విద్యుత్‌ప్రేరణల రూపంలో నాడీకణాలకు సరఫరా చేసే విజువల్ పిగ్మెంట్లు (వర్ణకాలు) క్షీరదాల వంటి జంతువుల కళ్లలో లేకపోవడం వల్ల అవి ఆ కాంతిని చూడలేవని శాస్త్రవేత్తలు భావించారు. కానీ అతినీలలోహిత కాంతిని చూసేందుకు ఈ పిగ్మెంట్లు అత్యవసరం కాదని తమ పరిశోధనలో తేలినట్లు సిటీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొన్ని జంతువుల్లో కార్నియా (నేత్రపటలం) కూడా యూవీ తరంగాలను ప్రసారం చేయగలదని, దీంతో యూవీ కాంతి రెటీనాను చేరి అవి చూడగలవని వారు అంటున్నారు. పిల్లులు, కుక్కలు అతినీలలోహిత కాంతిని చూడగలిగినా.. ఆ కాంతి ఎక్కువైతే వాటికి హానికరమేనట. అంతేకాదండోయ్.. అతినీలలోహిత కాంతితో చిత్రాలు చాలా మసక(బ్లర్)గా కనిపిస్తాయట. మన కంట్లో యూవీ కాంతిని తొలగించి మామూలు కాంతిని మాత్రమే స్వీకరించే కటకం ఏర్పడింది కాబట్టి సరిపోయింది. లేకపోతే.. మనకు ప్రపంచం అంతా మసకేసేదేమో!