'భగవద్గీత మత గ్రంథ కాదు'
గుడ్లవల్లేరు (కృష్ణాజిల్లా): భగవద్గీత మత గ్రంధం కాదని అదొక అడ్మినిస్ట్రేటివ్ మాన్యువల్ అని గీతలోని కొన్ని శ్లోకాల్ని వినిపించారు భారత దేశపు మెట్రోమెన్‌గా పిలువబడుతున్న రాష్ట్ర మెట్రో ప్రాజెక్టుల సలహాదారుడు పద్మ విభూషణ్ డాక్టర్ ఇ.శ్రీధరన్. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ వ్యవస్థాపకుడు స్వర్గీయ వల్లూరుపల్లి వెంకట రామ శేషాద్రిరావు సంస్మరణగా ఏటా నిర్వహించే స్మారకోపన్యాసాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి శనివారం ప్రసంగించారు.
విద్యార్ధినీ విద్యార్ధులందరూ భగవద్గీతను క్షుణ్ణంగా అర్ధం చేసుకోవాలని సూచించారు. సమతుల్య ఆహారం తీసుకుంటే తొందరగా నిద్ర పట్టడంతో పాటు వేకువజామునే నిద్ర లేచి, సమయానిన సక్రమంగా సద్వినియోగం చేసుకునేందుకు ఆరోగ్యం సహకరిస్తోందని చెప్పారు. విద్యార్ధులు సమయపాలనతో పాటు సమగ్ర సాంకేతిక సామర్ధ్యం కలిగి ఉండాలని తెలిపారు. మానవతా విలువలతో కూడిన పని విధానమే ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతలతో సాగే పని సంస్కృతి ప్రామాణికమైన అత్యంత ఆవశ్యకమని తెలిపారు. కాలేజీ చైర్మన్ డాక్టర్ వల్లూరుపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శి వల్లూరుపల్లి సత్యనారాయణరావు, సహ కార్యదర్శి వల్లూరుపల్లి రామకృష్ణ చేతుల మీదుగా స్ఫూర్తిదాయక ప్రసంగం అందించిన డాక్టర్ శ్రీధరన్‌కు దుశ్శాలువాతో సన్మానించి, సన్మాన పత్రాన్ని అందజేశారు. యాజమాన్యం చేతుల మీదుగా స్మారకోపన్యాస పురస్కారంగా అందుకున్న రూ.లక్ష నగదును తన తల్లి పేరిట స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్‌కు అందిస్తానని శ్రీధరన్ తెలియటం ఆయన సేవా భావానికి నిదర్శనంగా నిలిచింది.
కార్యక్రమంలో విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ డెఫ్యూటీ డెరైక్టర్ జి.పి.రంగారావు, ఢిల్లీ మెట్రో ప్రాజెక్ట్ డెఫ్యూటీ జనరల్ మేనేజర్ కె.రాజశేఖర్, విద్యాసంస్థ అధ్యక్షుడు వల్లభనేని సుబ్బారావు, ఉపాధ్యక్షుడు కేవీ కృష్ణారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.నాగేశ్వరరెడ్డి, డెరైక్టర్ డాక్టర్ ఎస్‌ఆర్‌కే రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రవీంద్రబాబు, కార్యక్రమ కో-ఆర్డినేటర్లు బి.కరుణకుమార్, డాక్టర్ ఎం.కామరాజు తదితరులు పాల్గొన్నారు.