
వైభవంగా భజన మండళ్ల శోభాయాత్ర
తిరుపతి కల్చరల్: టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన మండళ్ల శోభాయాత్ర శుక్రవారం వైభవంగా జరిగింది. రెండు రోజుల పాటు జరుగనున్న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తిరుపతిలోని రైల్వేస్టేషన్ వెనుకనున్న మూడవ సత్రం ప్రాంగణంలో ఉదయం 5 నుంచి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించారు. 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సంకీర్తనాలాపన, ధార్మిక సందేశం, మానవాళికి హరిదాసుల ఉపదేశాలు అందించారు.
రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి విచ్చేసిన 3500 మంది భజన మండళ్ల సభ్యులు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం నుంచి మూడవ సత్రం వరకు వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు.
టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పీఆర్.ఆనందతీర్థాచార్య మాట్లాడుతూ హరినామ సంకీర్తన ప్రజల్లో అశాంతిని దూరం చేస్తుందన్నారు. శనివారం ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద ప్రముఖులతో మెట్ల పూజ నిర్వహిస్తామన్నారు. గోవిందరాజస్వామి ఆలయం డెప్యూటీ ఈవో చంద్రశేఖర్‌పిళ్లై, ఏఈవో ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికారులు, భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.