'క్లిష్ట సమయంలో శోభానాగిరెడ్డి తోడుగా నిలబడ్డారు'
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, దివంగత ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి తనకు అక్కలాంటిదని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. 'రాజకీయ కుటుంబంలోకి నుంచి వచ్చిన శోభానాగిరెడ్డి 27 ఏళ్ల వయస్సులోనే ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. గుంటూరు పర్యటనలో ఉండగా శోభానాగిరెడ్డి సంబంధించిన విషాదవార్తను విన్నప్పడు దిగ్బ్రాంతికి గురయ్యాను. అసెంబ్లీలో ఇలాంటి పరిస్టితుల్లో మాట్లాడవలసి వస్తుందని అనుకోలేదు. ఎన్నికల ప్రచారం సమయంలో శోభానాగిరెడ్డి మరణించడంతో భూమానాగిరెడ్డి తీవ్ర విచారంలో మునిగిపోయారు.
భూమా శోభానాగిరెడ్డి పిల్లలు చాలా చిన్నవారని.. ఆ కుటుంబాన్ని చూస్తే చాలా బాధకలుగుతోంది. ఎల్లవేళలా భూమా కుటుంబానికి తోడు ఉంటాం. నాన్న చనిపోయిన తర్వాత రాజకీయంగా అంతరించిపోతామన్న మాటలు చెప్తున్నప్పుడు శోభానాగిరెడ్డి నాకు తోడుగా నిలబడ్డారు. అలాంటి వ్యక్తి గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని నేను కలలోకూడా అనుకోలేదు. శోభానాగిరెడ్డి భౌతికంగా మనమధ్య లేకున్నా.. ఆళ్లగడ్డ ప్రజలు ఆమెను 18వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఉప ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా... శోభమ్మపై విశ్వాసం చూపారు. శోభమ్మ ఎక్కడ ఉన్నా.. ఆత్మకు శాంతి చేకూరాలి' అని శాసనసభలో శోభానాగిరెడ్డి సంతాప తీర్మానం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు.