భూమా నాగిరెడ్డి ఎస్పీ వద్దకు వెళ్లినప్పటి దృశ్యం
కర్నూలు: వైఎస్ఆర్ సీపీ నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బెయిల్ పిటిషన్ను జిల్లా సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ఈ నెల 1వ తేదీన అరెస్ట్ అయిన నాగిరెడ్డి ఆనారోగ్యం కారణంగా ప్రస్తుతం నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. నాటకీయ పరిణామాల మధ్య భూమా నాగిరెడ్డిని ఈ నెల 1వ తేదీ శనివారం పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల పురపాలక సంఘం సమావేశం సందర్భంగా ప్రజా సమస్యలపై తన ప్రసంగాన్ని వినాల్సిందేనని.. డోర్ వేయమని భూమా సైగ చేసినందువల్లే వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు శుక్రవారం(గత నెల 31) టీడీపీ కౌన్సిలర్లపై దాడులకు పాల్పడ్డారని పేర్కొంటూ భూమాపై మూడు కేసులు నమోదు చేశారు.
భూమా ప్రోత్సాహంతోనే దాడులు జరిగాయని పేర్కొంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశామని, లొంగిపోవాలని ఎస్పీ హెచ్చరించారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో వెంట రాగా భూమా శనివారం స్వయంగా ఎస్పీ రవికృష్ణ వద్ద లొంగిపోయారు. అదే రోజు రాత్రి ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ రామ్మోహన్ ఎదుట భూమా నాగిరెడ్డిని పోలీసులు హాజరుపరచగా, 14 రోజుల రిమాండ్‌కు ఆదేశించారు.
జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు శనివారం రాత్రి భూమాని స్థానిక మెడికేర్ ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత మంగళవారం మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్ నిమ్స్కు తరలించారు.
**