
ముఖ్యమంత్రి వద్దే పరిష్కరించుకుంటాం
భూమా నాగిరెడ్డితో సమస్యలపై శిల్పా ప్రకటన
సాక్షి, కర్నూలు: ‘‘భూమా నాగిరెడ్డితో మాకు సమస్యలు ఉన్న మాట వాస్తవమే. అయితే వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద పరిష్కరించుకుంటాం’’ అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. గురువారం ఆయన నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే ఫిలిప్ సి టాచర్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ ఫ్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చన్నాయుడు, జిల్లా అధ్యక్షుడితో కూడిన కమిటీ త్వరలోనే సీఎం చంద్రబాబును కలవనుందని..
ఆ సందర్భంగా భూమాతో సమస్యలను చర్చించి పరిష్కరించుకుంటామన్నారు. శ్రీశైలంలో అభివృద్ధి పనులపై అనేక ఆరోపణలు వస్తున్నాయని.. త్వరలోనే చర్యలు చేపడతామన్నారు. అదేవిధంగా కర్నూలు కార్పొరేషన్ అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. తుంగభద్ర నుంచి ఎల్‌ఎల్‌సీకి మే నెలలో నీళ్లు ఇచ్చేందుకు బళ్లారి కలెక్టర్ అంగీకరించినట్లు జిల్లా కలెక్టర్ విజయమోహన్ తెలిపారన్నారు. జిల్లాలో కరువు నివారణకు ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసిందన్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్.సి.టాచర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్రిస్టియన్, మైనార్టీ వర్గాల స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్రంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు.