పీఏసీ చైర్మన్‌గా భూమా నాగిరెడ్డి!
* నేడు ప్రకటన లాంఛనమే..
* పీయూసీకి కాగిత వెంకట్రావు
* అంచనాల కమిటీ చైర్మన్‌గా మోదుగుల
సాక్షి, హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ఉమ్మడి ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. పీఏసీ చైర్మన్ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. ఈ నేపథ్యంలో భూమా ఎంపికను స్పీకర్ కోడెల శివప్రసాదరావు శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశముంది. పీఏసీ చైర్మ న్ పదవిని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీ. దీంతో శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీ పీఏసీ చైర్మన్ పదవికి భూమా పేరును ప్రతిపాదిం చింది. అదేవిధంగా.. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ(పీయూసీ) చైర్మన్‌గా అధికార టీడీపీ పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, అంచనాల కమిటీ చైర్మన్‌గా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి పేర్లను ప్రతిపాదించారు. వీరు కూడా ఆయా పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు.
ఈ ఇద్దరి ఎంపిక కూడా లాంఛనమే కానుంది. వీరి ఎంపికపై కూడా స్పీకర్ కోడెల శనివారం అధికారిక ప్రకటన చేసే అవకాశ ముంది. ఇక.. పీఏసీలో సభ్యులుగా ఎమ్మెల్యేల కోటాలో వైఎస్సార్‌సీపీ సభ్యులు కాకాని గోవర్ధనరెడ్డి, ఆది మూలం సురేష్, దాడిశెట్టి రాజా పేర్లను ప్రతిపాదించారు. టీడీపీ తరఫున ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, బీకే పార్థసారథి, తోట త్రిమూర్తులు, పీవీజీఆర్ నాయుడు, బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేరును ప్రతిపాదించారు. పీయూసీ సభ్యులుగా వైఎస్సార్‌సీపీ సభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జలీల్‌ఖాన్, సుజయ్‌కృష్ణ రంగారావు, కొరుముట్ల శ్రీనివాస్‌ల పేర్లను ఆ పార్టీ ప్రతిపాదించింది. టీడీపీ నుంచి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోళ్ల లలితకుమారి, ప్రభాకర్ చౌదరి, శివరామరాజు పేర్లను ఆ పార్టీ ప్రతిపాదించింది. అంచనాల కమిటీ సభ్యులుగా.. వైఎస్సార్‌సీపీ నుంచి ఎమ్మెల్యేలు కలమట వేంకట రమణ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కిడారి సర్వేశ్వరరావు, ఉప్పులేటి కల్పన పేర్లను ఆ పార్టీ ప్రతిపాదిం చింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, మీసాల గీత, తెనాలి శ్రావణ్‌కుమార్, శంకర్‌యాదవ్ పేర్లను ఆపార్టీ ప్రతిపాదించింది.