'ఇవాళ నాకు...రేపు మరొకరికి జరుగుతుంది'
హైదరాబాద్ : నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసును స్పీకర్ కోడెల శివప్రసాద్ సోమవారం తిరస్కరించారు. నియమాల ప్రకారం, సభ్యుల మద్దతు ఉన్నందున నోటీసును అంగీకరించాలని భూమా నాగిరెడ్డి కోరారు. ఎమ్మెల్యేనని కూడా చూడకుండా తనపై రౌడీషీ తెరిచారని.. ఇవాళ తనకు జరిగిందని....రేపు మరొకరికి జరుగుతుందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై తాము ప్రశ్నిస్తే..ఇలాంటి కేసులు పెడుతున్నారన్నారు.
అలాగే నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులపైనా ఇలాంటి కేసులే పెడుతున్నారని అన్నారు. తనపై కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని సభ దృష్టికి తీసుకు వచ్చారు. అయితే నంద్యాల మున్సిపాలిటీలో జరిగిన వివాదానికి అసెంబ్లీకి సంబంధం లేదని స్పీకర్ స్పష్టం చేశారు. తమ బాధ వినాలని భూమ నాగిరెడ్డి పదేపదే స్పీకర్‌ను కోరారు.
పోడియం ముందుకు వచ్చిన మరీ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ మాత్రం నిబంధనల ప్రకారం తాను నడుచుకుంటున్నానని అన్నారు. దీనిపై సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత స్పీకర్...భూమా నాగిరెడ్డి విజ్ఞప్తి మేరకు... ప్రివిలేజ్ మోషన్‌ను... ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేస్తానని ప్రకటించారు.