రాజధాని లేదు.. నిధులు లేవు...
రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు కదిలిరావాలి
ఏపీ ఉభయసభల సమావేశంలో గవర్నర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: ‘‘సమైక్యాంధ్రప్రదేశ్ విభజన తీరు తీవ్ర అసంతృప్తిని, చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. అధిక భాగం ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు, ఆశలు నెరవేరలేదు. అశాస్త్రీయ విభజన తీరు తెలుగు ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచింది. ఈ గాయాలు మానడానికి కొంత సమయం పడుతుంది’’ అని అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ పేర్కొన్నారు. విభజనానంతరం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని గానీ, రాష్ట్రాభివృద్ధికి తగిన నిధులు గానీ లేవన్నారు. జపాన్, సింగపూర్ ప్రేరణతో మహోద్యమంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి కదిలిరావాలని ప్రజలకు పిలుపిచ్చారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడం అందరి లక్ష్యం కావాలన్నారు. గవర్నర్ శనివారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం మేరకు.. ఉదయం 8:50 గంటలకు సభలోకి ప్రవేశించిన గవర్నర్‌కు సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. నరసింహన్ కుడి ఎడమల శాసనమండలి చైర్మన్ ఎ.చక్రపాణి, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌లు ఆశీనులయ్యారు.
జాతీయ గీతాలాపనతో సభ ప్రారంభమైంది. గవర్నర్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి ఇంగ్లిష్‌లో కొనసాగించారు. చివర్లో తిరిగి తెలుగులో మాట్లాడి తన 26 పేజీల ప్రసంగాన్ని ముగించారు. సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను గత 58 ఏళ్లలో దాదాపు 13.20 లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తే దానికి తగ్గట్టుగా అవశేష ఆంధ్రప్రదేశ్‌కు పరిహారం రాలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. ఏడు కీలక రంగాలకు చెందిన స్థితిగతులపై శ్వేతపత్రాలను విడుదల చేస్తామన్నారు. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటోందని, తమ ముందున్న పెను సవాళ్లను ఎదుర్కొనేందుకు అందరూ కలసి రావాలని విజ్ఞప్తి చేశారు.