ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్:
రాబోయే ఎన్నికల్లో సొంత గడ్డపై తమ పార్టీలను గెలిపించుకోవడం జిల్లాలో ఇద్దరు నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. వీరిలో ఒకరు డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ కాగా మరొకరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ‘పట్నం’ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. మండల పరిధిలోని శేరిగూడ గ్రామానికి చెందిన మల్లేశ్ ఇటీవల డీసీసీ అధ్యక్షుడిగా నియమితులు కాగా, ఎలిమినేడు గ్రామానికి చెందిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇద్దరూ ఒకే మండలానికి చెందిన నేతలు కావడం, పార్టీల్లో కీలక పదవుల్లో ఉండడంతో వచ్చే ఎన్నికలు వారికి అగ్నిపరీక్షగా నిలిచాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన బాధ్యత కూడా వారిపై పడింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌ను మల్లేశ్ ఆశిస్తుండగా, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కిషన్‌రెడ్డి తిరిగి పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఈ పరిస్థితుల్లో వచ్చే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వారికి సవాల్‌గా మారాయి.
గెలుపుపై దృష్టి..
నియోజకవర్గంలోని హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల్లో అత్యధిక ఎంపీపీలను, జెడ్పీటీసీలను గెలిపించుకోవడం ద్వారా తమ సత్తా చాటుకోవాలని ఇద్దరు నేతలు తహతహలాడుతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపోటములు వచ్చే సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపనుండడంతో తమ పార్టీలను విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత వారిపై పడింది. 2006 ఎన్నికల్లో హయత్‌నగర్, యాచారం ఎంపీపీలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఇబ్రహీంపట్నం, మంచాల ఎంపీపీలను టీడీపీ దక్కించుకుంది. జెడ్పీటీసీల విషయానికొస్తే హయత్‌నగర్, యాచారం, ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీలు కాంగ్రెస్ వశమయ్యాయి. మంచాల జెడ్పీటీసీని సీపీఎం కైవసం చేసుకుంది. ప్రస్తుతం మారిన రిజర్వేషన్ల నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడం ద్వారా అత్యధిక స్థానాలను తమ పార్టీలకు గెలిపించుకోవాలని ఇద్దరు నేతలు పావులు కదుపుతున్నారు. ముందుగా వచ్చే నగర పంచాయతీ ఎన్నికలు ఇద్దరూ దృష్టి సారించారు. నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట్ నగర పంచాయతీలు ఇటీవలే ఆవిర్భవించాయి. ఈ రెండు నగర పంచాయతీల చైర్మన్ పదవులు ఎస్సీ జనరల్‌కు రిజర్‌వ అయ్యాయి. సెమీఫైనల్ లాంటి ఎంపీటీసీ ఎన్నికలకు ముందు జరిగే నగర పంచాయతీ ఎన్నికలు ఇద్దరు నేతల సామర్థ్యానికి ప్రతీకగా నిలవనున్నాయి.
అగ్నిపరీక్ష!
Published Sun, Mar 9 2014 10:43 PM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
Advertisement