అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీ జెండా.. | Big gains for YSRCP in Anakapalli | Sakshi
Sakshi News home page

అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీ జెండా..

Published Fri, May 24 2019 4:18 PM | Last Updated on Sat, May 25 2019 12:22 PM

Big gains for YSRCP in Anakapalli - Sakshi

అనకాపల్లి: టీడీపీ కంచుకోటగా భావించే అనకాపల్లిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాగా వేసింది. అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌ స్థానంలో ఘన విజయం సాధించింది.  లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇక్కడి ప్రజలు విశేష ఆదరణ చూపారని ఎన్నికల ఫలితాలు  స్పష్టం చేస్తున్నాయి. మొత్తం మీద వైఎస్సార్‌ సీపీ అసెంబ్లీ ఆభ్యర్థి అమర్‌కు పోస్టల్‌ బ్యాలెట్లతో కలిపి 8,169 ఓట్ల మెజార్టీ సాధించారు. 
పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు మినహాయించి 18 రౌండ్ల పరిధిలో అమర్‌కు 72,504 ఓట్లు, పీలాకు 66,479 ఓట్లు లభించాయి.  ఫలితాన్ని అధికారికంగా ప్రకించాల్సి ఉంది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో వైఎస్సార్‌సీపీ అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి అమర్‌  తన సమీప ప్రత్యర్ధి పీలా గోవింద సత్యనారాయణపై మొదటి 13 రౌండ్ల వరకు ఆధిపత్యంతో కొనసాగగా 14, 15, 16, 17 రౌండ్లలో టీడీపీ అభ్యర్థి పీలాకు మెజార్టీ లభించింది. మళ్లీ 18వరౌండ్‌లో అమర్‌కే మెజార్టీ లభించింది. ముఖ్యంగా కశింకోట మండలం, 
అనకాపల్లి మండలాల్లో ఫ్యాన్‌కు మెజార్టీ రాగా అనకాపల్లి పట్టణంలో కాస్త వెనుకబడిందనే చెప్పాలి. మొత్తంమీద 8 వేల ఓట్లకు పైగా మెజార్టీ గెలుపొందిన అమర్‌ తన ఉద్వేగాన్ని ఆపులేకపోయారు. అమర్‌ను వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి కాండ్రేగుల సత్యవతి, వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ పరిశీలకుడు దాడి రత్నాకర్‌ తదితరులు అభినందించారు.  మొత్తం 18 రౌండ్లల్లో  జనసేన అభ్యర్థి పరుచూరి భాస్కర్‌రావుకు 11,896 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి ఐఆర్‌ గంగాధర్‌కు 1744, బీజేపీ అభ్యర్థి పొన్నగంటి అప్పారావుకు 2517 ఓట్లు వచ్చాయి. మొత్తం పోస్టల్‌ బ్యాలెట్లతో కలిపి 1,60,304 ఓట్లు పోలవ్వగా వైఎస్సార్‌సీపీకి 73197, టీడీపీకి 64,938, ఇతరులకు 22,159 ఓట్లు పోలయ్యాయి. 

బీజేపీ, కాంగ్రెస్‌ ఏజెంట్ల వాకౌట్‌ 
ఆంధ్రా యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్‌ ఇన్సిమెంట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పైఅంతస్తులో నిర్వహించిన అనకాపల్లి అసెంబ్లీ కౌంటింగ్‌కు హాజరైన బీజేపీ, కాంగ్రెస్‌ ఏజెంట్లకు కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో వారు వాకౌంట్‌ చేసి వెళ్లిపోయారు. ఈ అంశాన్ని అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్, జేసీ సృజన దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.   ఆమె అనకాపల్లి పార్లమెంట్‌ కౌంటింగ్‌ ప్రక్రియలో నిమగ్నం కావడంతో వారు నిరాశగా బయటకు వెళ్లారు. 

పోస్టల్‌ బ్యాలెట్లలోనూ మెజార్టీ 
అనకాపల్లి అసెంబ్లీ పరిధిలో పోస్టల్, సర్వీస్‌ ఓటుల్లో కూడా వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి గుడివాడ అమర్‌నాథ్‌కు మెజార్టీ ఓట్లు వచ్చాయి. అమర్‌కు 693 ఓట్లు, టీడీపీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణకు 459 ఓట్లు, జనసేన అభ్యర్ధి పరుచూరి భాస్కరరావుకు 97 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి పొన్నగంటి అప్పారావుకు 54 సర్వీస్‌ ఓట్లు వచ్చాయి. 

నోటాకు 2,517 ఓట్లు
ఎన్నికల కమిషన్‌ నిర్ణయం మేరకు ఎన్నికల పోలింగ్‌లో నోటాను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో  2,517 మంది ఎవరికి ఓటు వేసేందుకు ఇష్టపడకుండా నోటాకు నొక్కారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో1,58, 722 మంది ఈవీఎంల ద్వారా ఓట్లు వేయగా 18 రౌండ్ల పరిధిలో  నోటాకు 2,517 మంది ఓటు వేయడం గమనార్హం. 

అభిమానులు తరలిరావాలి
అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన అమర్‌నాథ్‌ శుక్రవారం ఉదయం నూకాంబిక అమ్మవారిని దర్శించుకొని అనంతరం రింగ్‌రోడ్డులోని పార్టీ కార్యాలయానికి విచ్చేస్తారని వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు తెలిపారు.   పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు, అనకాపల్లి ప్రజలు హాజరుకావాలని ఆయన కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement