హవాలా వెనుక నల్ల కుబేరులెవరు?
- బడా నేతల పాత్రపై అనుమానాలు
- ఓ ఏపీ మంత్రి, ఎంపీ అండతోనే వ్యవహారం
- ఇప్పుడేమీ చెప్పలేమంటున్న ఖాకీలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ హవాలా రాకెట్ వెనుక సూత్రధారులెవరన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. విశాఖ కేంద్రంగా బోగస్ కంపెనీల పేర్లతో సుమారు రూ.1,500 కోట్లను హవాలా రూపంలో తరలించిన ముఠా వెనుక ఎవరున్నారన్నది కనుక్కోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. అన్ని వంద ల కోట్లెవరివి? అవి హవాలా మార్గంలో ఎటు తిరిగి ఎటొచ్చాయి? అనే దానిపెనే ఇప్పుడు వారు ప్రధానంగా కూపీ లాగుతున్నారు. విశాఖలోని ఎంవీపీ కాలనీ కేంద్రంగా శ్రీ పద్మప్రియ స్టోన్ క్రషింగ్ ప్రైవేట్ లిమిటెడ్, పాండురంగాపురంలోని బాలముకుంద వేర్‌హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రెండు డొల్ల కంపెనీల పేరిట నగరంలోని 20 బ్యాంకు ఖాతాల ద్వారా హవాలా లావాదేవీలు సాగించిన ఘరానా ముఠాకు ఇక్కడ ఎవరు అండగా ఉన్నారనే అంశంపైనే పోలీసులు దృష్టి కేంద్రీకరించారు.
అత్తిలి టు కోల్‌కతా వయా శ్రీకాకుళం
పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురానికి చెందిన వడ్డి శ్రీనివాసరావు 20 ఏళ్ల క్రితమే కోల్‌కతాకు వలస వెళ్లాడు. అక్కడ ఉల్లిపాయల ఏజెంట్‌గా పనిచేసి సంపాదించిన డబ్బుతో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కురిడిలో కొంతకాలంగా శ్రీ పద్మప్రియ స్టోన్ క్రషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట క్రషర్ నిర్వహిస్తున్నాడు. ఇందుకోసం ఏడాదిన్నరగా శ్రీకాకుళం పట్టణం ఎల్‌బీఎస్ కాలనీలో భార్యతో కలసి నివాసముంటున్నాడు.
ఇతని కొడుకు వడ్డి మహేష్ కోల్‌కతాలోనే ఉంటూ హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బును విదేశాలకు పంపడంలో దిట్టగా పేరొందాడు. ప్రభుత్వాలకు పన్ను చెల్లించకుండా ఎగవేసే నల్లకుబేరులకు చెందిన కోట్లాది రూపాయల సొమ్మును బినామీ కంపెనీల ద్వారా విదేశాలకు పంపి వైట్ చేసి పెడుతూ కమీషన్లు దండుకుంటున్నాడు. విశాఖతోపాటు హైదరాబాద్, కోల్‌కతాల్లోని మొత్తం 30కి పైగా బ్యాంకు ఖాతాల ద్వారా బడా వ్యాపారుల సొమ్మును విదేశాలకు పంపుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది.
బెంజ్‌తో దొరికేశాడు..
రెండేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందాను మహేష్ కొన్న కొత్త బెంజి కారు బట్టబయలు చేసింది. ఓ చిన్న స్టోన్ క్రషర్ యజమాని కొడుకు ఖరీదైన బెంజ్ కారు కొనడంతో అనుమానం వచ్చిన ఐటీ అధికారులు అతని బ్యాంకు లావాదేవీలపై కన్నే శారు. విశాఖ, శ్రీకాకుళం, కోల్‌కతాల్లో సోదాలు నిర్వహించి 4 రోజుల క్రితమే మహేష్‌ను కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అతను ఇచ్చిన సమాచారంతోనే శ్రీకాకుళంలో నివాసముంటున్న తండ్రి వడ్డి శ్రీనివాసరావును, కారు డ్రైవర్‌ను, ఇంట్లో పనిచేసే వంట మనిషిని సైతం అదుపులోకి తీసుకుని విశాఖలో విచారిస్తున్నారు.
తెర వెనుక ఎవరు?
హవాలా వ్యాపారంలో ఆరితేరిన మహేష్ విశాఖ కేంద్రంగా బ్యాంకు ఖాతాలు తెరవడం, ఇక్కడి నుంచే వందల కోట్ల డబ్బు పంపడం వెనుక కచ్చితంగా ఉత్తరాంధ్ర రాజకీయ నేతల హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిండా పాతికేళ్లు కూడా లేని యువకుడు రూ.కోట్ల హవాలా రాకెట్ నడిపాడంటే అధికార పార్టీ నేతల అండదండలు లేకుండా సాధ్యం కాదని పోలీసులే భావిస్తున్నారు. పక్కాగా ధ్రువీకరించడం లేదు కానీ.. ఏపీకి చెందిన ఓ మంత్రి, మరో ఎంపీ పాత్రపైనే పోలీసులు కూపీ లాగుతున్నట్టు తెలుస్తోంది.
ఈ హవాలా వెనుక ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మహేష్ తండ్రి శ్రీకాకుళంలోనే ఎందుకు మకాం వేశాడు? కోల్‌కతా నుంచి శ్రీకాకుళానికి ఎందుకు మకాం మార్చాడు? క్రషర్ పేరిట అక్కడ ఆయన చేస్తున్న వ్యవహారాలేమిటి? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తునారు. మహేష్, అతని తండ్రి శ్రీనివాసరావుల ఫోన్ కాల్ లిస్టును పరిశీలిస్తున్నారు. అధికార పార్టీ ప్రముఖుల పాత్ర ఉండొచ్చని భావిస్తున్న ఈ కేసులో పోలీసులు పక్కాగా విచారణ చేçపడతారా.. లేదంటే దొరికిన వారితోనే సరిపెట్టేస్తారా అన్నది త్వరలో తేలనుంది.