జిల్లాకు భారీ ప్రాజెక్టులు తెస్తా
భీమవరం : పశ్చిమ గోదావరి కోడలిగా కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు భారీ ప్రాజెక్టులు తీసుకువస్తానని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా) నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. సోమవారం భీమవరం వచ్చిన ఆమె రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆక్వా పరిశ్రమకు పేరుగాంచిన భీమవరం ప్రాంతంలో ఆక్వా ఫుడ్ ఉత్పత్తుల పరిశ్రమలతోపాటు ఆక్వా ఉత్పత్తులు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్‌ల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. నరసాపురంలో పోర్టు నిర్మాణంతోపాటు, పేరుపాలెం బీచ్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, రాష్ట్ర గనులు, స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి పీతల సుజాత, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీలు తోట సీతారామలక్ష్మి, గోకరాజు గంగరాజు, మాగంటి బాబు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, బండారు మాధవనాయుడు, నిమ్మల రామానాయుడు, వేటుకూరి శివరామరాజు, బడేటి బుజ్జి, యర్రా నారాయణస్వామి, మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు అభివృద్ధికి కృషి చేస్తా
ఏలూరు : ఏలూరు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల సహాయమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్‌లో సోమవారం రాత్రి సీతారామన్‌కు ఘనంగా పౌరసన్మానం నిర్వహించారు. పూలమాలలు, జ్ఞాపికతో కేంద్రమంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏలూరు పురాతన నగరమని, నగరాన్ని ఏవిధంగా అభివృద్ధి చేయాలో పూర్తిస్థాయిలో డాక్యుమెంట్ త యారు చేయడం శుభపరిణామన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే బడేటి కోటరామారావు(బుజ్జి), ఉండి ఎమ్మెల్యే కలవపూడి శివ, మేయర్ షేక్ నూర్జహాన్, అంబికా కృష్ణ, డెప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కమిషనర్ కేఈ సాధన తదితరులు పాల్గొన్నారు.
వర్జీనియా రైతుల సమస్యలు పరిష్కరిస్తా
కొయ్యలగూడెం : పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొయ్యలగూడెం పొగాకు వేలం కేంద్రంలో సోమవారం పొగాకు రైతుల సమావేశం నిర్వహించారు. అధికారులు పొగాకుకు ప్రత్యామ్యాయం చూపటం లేదని, దీంతో నష్టం వస్తున్నా సాగు చేస్తున్నామని పలువురు రైతులు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కంపెనీలన్నీ కుమ్మక్కై ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నాయని దీంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను తెలుసుకున్న అనంతరం సీతారామన్ మాట్లాడుతూ ధర తగ్గడంపై గతంలో తాను బోర్డు అధికారులతో మాట్లాడానని చెప్పారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బయ్యనగూడెంలో పొగాకు పంటను పరిశీలించారు. మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఎంపీలు మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు పాల్గొన్నారు.