బీహార్ దొంగల బీభత్సం
భీమవరం అర్బన్ :భీమవరంలో బీహార్ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టుకోవడానికి ప్రయత్నించిన స్థానికులు, పోలీసులపై నాటుతుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ధైర్యంతో ముందుకు దూకిన పాలకోడేరు కానిస్టేబుల్ వై.వెంకటేశ్వరరావు వెంట్రుక వాసిలో బుల్లెట్ నుంచి తప్పించుకున్నాడు. తుపాకీ కాల్పుల శబ్దాలకు ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు ఒక దొంగ పోలీసులకు చిక్కగా, మరో ఇద్దరు పరారయ్యారు. అప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారమందించి అక్కడి నుంచి వచ్చిన ఆదేశాలతో స్థానిక పోలీసులు భీమవరం సరిహద్దుల్లో మోహరించి, వాహనాల తనిఖీ ప్రారంభించారు.
వివరాలు ఇవి.. విజయవాడకు చెందిన విస్సంశెట్టి కనకదుర్గ అనే 65 ఏళ్ల వృద్ధురాలు స్థానిక కారుమూరి వారి వీధిలో నివసిస్తున్న తన కుమారుడు గోపాలకృష్ణ ఇంటికి వచ్చారు. ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో మావుళ్లమ్మ ఆలయానికి ఒంటరిగా వెళ్లి వస్తూ మధ్యతో తటవర్తి వారి వీధిలో చెరుకురసం తాగేందుకు ఆగాడు. బీహార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి చెరుకురసం తాగారు. కనకదుర్గ అక్కడ నుంచి సమీపంలోని తన కుమారుని ఇంటికి బయలుదేరడంతో ఆమె వెనుకనే వచ్చిన వారు అదను చూసి ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యారు. దీంతో కిందపడిన కనకదుర్గ కేకలు వేయడంతో స్థానికులు విషయం తెలుసుకుని బైక్‌ను వెంబడించారు. నాచువారి సెంటర్ వద్ద వారు కనిపించడంతో స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించారు.
ఇంతలో అటునుంచి వస్తున్న పాలకోడేరు పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు కూడా వారిని వెంబడించాడు. మరో వైపు వన్‌టౌన్ పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇద్దరు దొంగలు బైక్‌పై పరార్ కాగా ఒకడు పరుగు తీశాడు. బీవీ రాజు మునిసిపల్ పార్క్ సమీపంలోని పావని గార్మెంట్స్ రోడ్‌లో అతను పరిగెత్తటంతో వెంబడించిన స్థానికులను దగ్గరకు రావద్దంటూ హెచ్చరించాడు. అయినా కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు, స్థానికులు వెంటపడ్డారు. తన వద్ద ఉన్న నాటుతుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపిపాడు. ఒక బుల్లెట్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు తలపక్కగా దూసుకువెళ్లింది. అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై విజయకుమార్, సిబ్బంది, పోలీసులు కూడా తోడు కావడంతో ధైర్యం చేసి దొంగను పట్టుకోగలిగారు.
అతడిన వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి వివరాలు సేకరిస్తున్నారు. టౌటౌన్ సీఐ జయసూర్య స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. బీహార్ నుంచి ఎంతమంది వచ్చారు, తప్పించుకున్న వారు ఎక్కడికి వెళ్ళారు తదితర వివరాలను చెప్పించే ప్రయత్నం సీఐ జయసూర్య చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న నరసాపురం డీఎస్సీ రఘువీరారెడ్డి హుటాహుటిన భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. నిందితుడు బీహార్‌కు చెందినవాడైనప్పటికీ తెలుగులో మాట్లాడుతున్నాడు. దీంతో చాలా కాలంగా నిందితులు ఈ ప్రాంతంలోనే నివశిస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దొంగలు తుపాకీతో కాల్పులు జరపడం ఈ ప్రాంతంలో సంచలనం కలిగించింది.