మెరుగుపెడతామంటూ మార్చేసిన బంగారు ఆభరణాలు, మోసాలకు పాల్పడిన బీహార్ యువకులు
తూర్పుగోదావరి, ఆలమూరు (కొత్తపేట): మీ పాత వస్తువులు కొత్తగా తళతళలాడేలా మెరుగు పెడతామంటూ వచ్చేవారితో జనం మోసపోయిన సంఘటనలెన్నో. మెరుగు పేరుతో బంగారు అభరణాలనుంచి బంగారాన్ని కాజేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. అదే విధంగా ఆలమూరు మండలం బడుగువానిలంకలో మోసగించేందుకు యత్నించిన బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులను స్థానికులు నిర్బంధించారు. వివరాల్లోకి వెళితే.. బడుగువానిలంక కొత్తూరులో అన్ని ఆభరణాలను తక్కువ రేటుకే సరికొత్తగా ఉండేలా మెరుగుపెడతామంటూ బీహార్‌కు చెందిన ఇద్దరు యువకులు ఆదివారం వీధి వీధీ తిరిగారు. దూలం పండు నివాసానికి వెళ్లిన వారు ఆయన భార్య సుబ్బలక్ష్మి, కుమార్తె పోలావతిలను మెరుగు పెట్టించుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. తొలుత ఇత్తడి వస్తువులను మెరుగుపెడతామని, మీరు సంతృప్తి చెందితే మిగిలిన వస్తువులకు కూడా మెరుగు పెట్టించుకోండని నమ్మ బలికారు.
దాంతో ఆమహిళలు తొలుత దేవుడి మందిరంలోని ఇత్తడి వస్తువులను, తరువాత వెండి పట్టీలను మెరుగుపెట్టించుకున్నారు. వాటిని యథాతథంగా ఆమహిళలకు బిహారీలు అప్పగించారు. అనంతరం వారు తమ మెడలో ఉన్న బంగారు గొలుసును, మంగళ సూత్రాలను మెరుగు పెట్టించేందుకు అంగీకరించారు. ఆ బంగారు ఆభరణాలను బిహారీ యువకులు తమ వెంట తెచ్చుకున్న గిన్నెలో పోసిన ద్రావకంలో కడిగి మళ్లీ ఆవస్తువులను వారికి ఇచ్చేశారు. అయితే ఆరు కాసులు ఉండాల్సిన ఆబంగారు ఆభరణాల బరువు మూడున్నర కాసులు ఉన్నాయి. రెండున్నర కాసులు తక్కువగా ఉండటంతో పాటు రంగు తగ్గి వెలవెలబోయాయి. జరిగిన మోసాన్ని గుర్తించి ఆ మహిళలు కేకలు వేశారు. దాంతో గ్రామస్తులు ఆయువకులను పట్టుకుని బంధించి దేహశుద్ధి చేశారు. అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు. బాధిత కుటుంబసభ్యులుపోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment