సాక్షి, మర్రిపూడి (ప్రకాశం): ఎన్నికలకంటే మన భవిష్యత్‌ను నిర్దేశించేవి. మనల్ని పాలించే నేతలను ఎన్నుకునేవి. అంత ప్రాధాన్యం ఉన్న ఎన్నికల్లో టీడీపీ నేతల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. ప్రలోభాలను పక్కనపెడితే కనీసం ప్రశాంతంగా ఓటుహక్కు వినియోగించుకోలేని విధంగా టీడీపీ నేతల ఆగడాలు ఉంటున్నాయి. ఇందుకు 2014లో జరిగిన ఎన్నికలే నిదర్శనం. ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలను బెదిరించడం వారిపై దౌర్జన్యానికి దిగడం టీడీపీ నేతలకు ఆనవాయితీగా వస్తోంది. టీడీపీ నేతల దాడుల్లో ప్రాణాలు సైతం కోల్పోయిన సంఘటనలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత సంఘటనలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు మండలంలోని 21 పంచాయతీల్లో 455 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.
అయ్యవారిపాలెంలో
మండలంలో అయ్యవారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదనే అక్కస్సుతో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పొడ్డారు. ఈ దాడుల్లో పలువురికి రక్త గాయాలైయ్యాయి. గత సంఘటనల నేపథ్యంలో అధికారులపై సమస్యాత్మక గ్రామాలపై, సమస్యాత్మక వ్యక్తులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జి.అగ్రహారంలో..
మండలంలోని గోసుకొండ అగ్రహారం గ్రామంలో 2014లో పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ బూతుల వద్ద ఇరువర్గీయులు మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ సానుభూతిపరులు చేసిన దాడుల్లో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన తానికొండ శ్రీనివాసులు, రావులపల్లి ఏడుకొండలు, తేలుకుట్ల వెంకయ్యలకు గాయాలైయ్యాయి.
టీడీపీ దాడిలో ఎంపీటీపీ భర్త వెంకయ్య మృతి
మర్రిపూడి మండలం కెల్లంపల్లి పంచాయతీ జి. అగ్రహారంలో 2014 సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో కెల్లంపల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా తెలుకుట్ల గురవమ్మ (వైఎస్సార్ సీపీ) నుంచి పోటీ చేసింది. ఆ ఎన్నికల సమయంలో తెలుగుదేశం కార్యకర్తలు తేలుకుట్ల గురవమ్మ భర్త వెంకయ్యపై దాడిచేశారు. ఈ దాడిలో గాయపడిన వెంకయ్య ఒంగోలు వైద్యశాలలో నెల రోజు పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందారు. తన భర్త వెంకయ్య తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు పొట్టనపెట్టుకున్నారనే విషయం తెలుసుకుని దిగులుతో కెల్లంపల్లి ఎంపీటీసీ సభ్యురాలు తేలుకుట్ల గురవమ్మ ఒక సంవత్సరం తర్వాత ప్రాణాలు కోల్పోయింది.
2014లో విచ్చలవిడిగా దాడులు..
2014 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. మండలంలోని జువ్విగుంట గ్రామంలోని కేజీకండ్రిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ స్థానాలకు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు గొడవ సృష్టించారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్న తరుణంలో పోలింగ్ బూతులో ఉన్న ఏజెంట్ల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గీయుల మధ్య తోపులాట మొదలై ఘర్షణకు దారితీసింది. అనంతరం పథకం ప్రకారం టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో 10 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీస్‌లు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇరువర్గాలను కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. దీంతో పోలింగ్ తిరిగి సజావుగా సాగింది. అప్పటి జేసీ, కందుకూరు ఆర్‌డీఓ బాపిరెడ్డి పోలింగ్ కేంద్రానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.
ప్రశాంతంగా జరిగేలా చూడాలి
గత ఎన్నికల్లో నా తండ్రి వెంకయ్య, తల్లి గురవమ్మను టీడీపీ నేతల దాడులతో కోల్పోయాను. ఈ ఎన్నికల్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. మా గ్రామం లాంటి సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యే నిఘా పెట్టాలి.
- తేలుకుట్ల వెంటేశ్వర్లు, కెల్లంపల్లి
455 మందిపై బైండోవర్ కేసులు పెట్టాం
మండలంలోని అన్ని పంచాయతీల్లో సమస్మాత్మక గ్రామాలు, వ్యక్తులను గుర్తించి ఇప్పటి వరకు 455 మందిపై బైండోవర్ కేసులు పెట్టాం. 8 మంది రౌడీషీటర్లు పై కేసు నమోదు చేశాం. మరికొంత మందిపై బైండోవర్ కేసులు పెడుతున్నాం. ఈ నెల 11న జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు చేపడుతున్నాం. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఉపేక్షించేది లేదు. ఎవరి ఓటు వారు భయపడకుండా ప్రశాంతమైన వాతావరణంలో వేసుకోవాలి. ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే పోలీస్‌ల దృష్టికి తీసుకురావాలి.
- కె.మాధవరావు, ఎస్సై
Comments
Please login to add a commentAdd a comment