సాక్షి, అమరావతి బ్యూరో: ఓటు అనేది యాంత్రికంగా ఉపయోగించుకునే హక్కు కాదని, ప్రజాస్వామ్యం మనుగడకు అది అత్యంత బలమైన ఆయుధమని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ఓటరుగా చేరడానికి యువత ముందుకు రావాలని, అర్హులను ఓటరుగా నమోదు చేయించే బాధ్యత కూడా స్వీకరించాలని పిలుపునిచ్చారు. ఓటరుగా నమోదయ్యాక ఓటర్ల జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు. శనివారం విజయవాడలో జరిగిన పదో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలంటే హక్కులతో పాటు విధుల గురించి కూడా తెలుసుకోవాలని చెప్పారు. ఓటు హక్కు ద్వారా మన ప్రజాస్వామ్య దేశాన్ని దృఢంగా, అజేయంగా నిలిపేందుకు వీలుంటుందని అన్నారు. ప్రస్తుతం 2020 ఓటర్ల జాబితా సవరణ జరుగుతోందని, ఫిబ్రవరి 14న తుది జాబితా ప్రచురిస్తారని తెలిపారు. ఎన్నికల్లో సమర్థులను ఎన్నుకోవడం మన బాధ్యత, కర్తవ్యమని గవర్నర్ వెల్లడించారు.
గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న అదనపు డీజీపీ రవిశంకర్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా, కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప
గ్రామీణ ప్రాంతాల ఓటర్లలోనే ఎక్కువ చైతన్యం
ఆధునిక సాంకేతికతను జోడించి ఎన్నికలు నిర్వహించడంలో మనదేశం ప్రపంచంలో ఎన్నో దేశాలకంటే ముందంజలో ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్‌కుమార్ చెప్పారు. ఓటు హక్కును వినియోగించుకోవాలన్న భావన ప్రతి ఒక్కరిలోనూ అంతర్గతంగా ఏర్పడాలన్నారు. అక్షరాస్యత అధికంగా ఉన్న పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఓటర్లు ఎక్కువ చైతన్యం కలిగి ఉన్నారని పేర్కొన్నారు. పట్టణ ప్రాంత ఓటర్లలోనూ ఇలాంటి చైతన్యం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జేసీ కె.మాధవీలత, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కె.రక్షణనిధి, జేసీ–2 మోహన్‌కుమార్, సబ్‌కలెక్టర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు.
అవార్డుల ప్రదానం
గత సార్వత్రిక ఎన్నికలు, ఓటర్ల జాబితా నిర్వహణ, ఓటు హక్కుపై చైతన్యం వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 29 మంది అధికారులకు గవర్నర్ అవార్డులు, ప్రసంశా పత్రాలను అందజేశారు. అదనపు డీజీపీ ఎ.రవిశంకర్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా, కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప తదితరులు అవార్డులు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment