
అదో పెద్ద బూతు పాలసీ
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మద్యం పాలసీ పెద్ద బూతు పాలసీ, ప్రజాకంటక పాలసీ అని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు.
దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న దేవాలయాలు, ప్రభుత్వ స్కూళ్లకు వంద మీటర్ల పరిధిలో మద్యం షాపులు ఉండకూడదు, అదే ప్రైవేటు గుళ్లు, ప్రైవేటు స్కూళ్ల దగ్గర అయితే మద్యం షాపులు పెట్టుకోవచ్చా? అంటే ఆ స్కూళ్లకు, ఆ గుళ్లకు వెళ్లే వాళ్లు మనుషులు కాదా? అని ప్రశ్నించారు. ఇళ్ల మధ్యలోనే షాపులుండటం వల్ల తాగుబోతులతో మహిళలు నానా మాటలు పడాల్సి వస్తోందని, చిన్నారులు కూడా జుగుప్సాకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు అంతగా మద్యం తాగించాలనుకుంటే ఏ సూపర్ మార్కెట్లలాగానో ఊరిబయట ఓ కాంప్లెక్సు కట్టించుకుని అక్కడ అమ్ముకోవాలిగానీ, ఇళ్ల మధ్యలో, గుళ్ల మధ్యలో మద్యం అమ్ముతూ మహిళల మాన ప్రాణ రక్షణకు విలువ లేకుండా చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు.