నామినేటెడ్ పదవులు దక్కని వైనం
సొంత మంత్రుల శాఖల్లోనూ అవమానం
అసంతృప్తిలో జిల్లా నాయకులు, కార్యకర్తలు
రాష్ట్ర అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లే యత్నం
నేడు బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం
విజయవాడ : అటు కేంద్రంలో అధికారంలోనూ, ఇటు రాష్ట్రంలో అధికార పార్టీకి మిత్రపక్షంగా ఉన్నా తమకు న్యాయం జరగట్లేదని బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటినా జిల్లాలో ఒక్క నామినేటెడ్ పదవైనా దక్కకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జెండాను మోయడానికే తమను ఉపయోగిస్తున్నారంటున్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం జరిగే పార్టీ వ్యవస్థాపక దినోత్సవానికి వస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు దృష్టికి సమస్య తీసుకెళ్లాలని యోచిస్తున్నారు.
మంత్రుల శాఖల్లోనూ అవమానం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు బీజేపీకి చెందినవారే. నూతనంగా ఏర్పడిన విజయవాడ ప్రభుత్వాస్పత్రి కమిటీలో గానీ, దసరా ఉత్సవాల సమయంలో దుర్గగుడి ఉత్సవ కమిటీలో గానీ బీజేపీ నేతలకు అవకాశం దక్కలేదు. పార్టీకి చెందిన మంత్రులు తమ సొంత శాఖల్లో కూడా బీజేపీ నేతలకు అవకాశం కల్పించకపోవడంపై పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేల సిఫారసులను మాత్రమే మంత్రులు ఆమోదిస్తున్నారు తప్ప బీజేపీ సీనియర్ నేతలు చెప్పిన మాటల్ని లెక్కచేయడం లేదని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
అండగా నిలబడరేం..?
సత్యనారాయణపురం సీతారామ కల్యాణమండపం వివాదం విషయంలో కూడా తాము రోడ్డెక్కి టీడీపీ ఎమ్మెల్యే తీరును ఎండగట్టినా బీజేపీ మంత్రులు స్పందించకపోవడంపై వారు ఆగ్రహంతో ఉన్నారు. దుర్గగుడి చైర్మన్ పదవిని బీజేపీకి ఇస్తారంటూ గతంలో ప్రచారం జరిగిందే తప్ప ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. అలాగే, దేవాలయాల కమిటీల్లోనూ, మార్కెట్ యార్డుల కమిటీల్లోనూ తమకు అవకాశాలు కల్పించాలని బీజేపీ నేతలు కోరడమే తప్ప రాష్ర్ట ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనిపై మంత్రులు స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
మిత్రధర్మమంటూ నోరు మూసేస్తున్నారు..
రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. విపక్షాలతో కలిసి టీడీపీ నేతల్ని ఎండగట్టేందుకు స్థానిక బీజేపీ నేతలు సిద్ధమైనప్పుడల్లా మిత్రధర్మమంటూ సీనియర్లు నోరు నొక్కుతున్నారని, దీంతో తప్పని పరిస్థితుల్లో అవమానాలు దిగమింగి పనిచేయాల్సి వస్తోందని బీజేపీ కార్యకర్తలు కొందరు చెబుతున్నారు.
సభ్యత్వ నమోదు, ప్రముఖులు వచ్చినప్పుడు సమావేశాలకు ఆహ్వానించడమే తప్ప ఇతర విషయాల్లో క్యాడర్‌కు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది మరికొందరి వాదన. దీంతో క్యాడర్ చేజారి పోతుందేమోనన్న భయం జిల్లా, నగర నేతల్లో వ్యక్తమవుతోంది. జిల్లా నేతలు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర అధ్యక్షుడు సమస్య వివరించాలని, అక్కడి నుంచి కూడా సరైన స్పందన రాకపోతే జాతీయ పార్టీ దృష్టికి తీసుకువెళ్లాలని స్థానిక నాయకులు భావిస్తున్నారు. తాము మాత్రమే మిత్రధర్మం పాటిస్తే సరిపోదని, టీడీపీ నేతలు కూడా పాటించాలని, ఆ దిశగా రాష్ట్ర పార్టీ చర్యలు తీసుకోవాలని కోరనున్నారు.
బీజేపీ నేతల్లో నైరాశ్యం..!
Published Mon, Apr 6 2015 1:10 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement