
టీడీపీపై బీజేపీ ఏపీ నేత రుసరుస
తమ పార్టీ కార్యకర్తలను టీడీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి: తమ పార్టీ కార్యకర్తలను టీడీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలకు ఇళ్లు కేటాయించడం లేదని, సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత‍్వం మంజూరు చేసే ఇళ్లను కూడా తమ పార్టీ శ్రేణులకు ఇవ్వడం లేదని, వాటికి ఎన్టీఆర్ పేరు పెడుతున్నారని విమర్శించారు.
ఇకనైనా ఇలాంటి విధానాన్ని విడనాడాలని టీడీపీకి సూచించారు. అలాగే కేంద్ర పథకాలకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లలో తెలంగాణలో ప్రధానమంత్రి ఫొటో పెడుతున్నారని, కానీ, ఏపీలో మాత్రం అలా చేయడం లేదని ఆక్షేపించారు. టీడీపీ మిత్రపక్షమైనా ప్రభుత్వ పథకాల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టకపోవడం బాధాకరమన్నారు. మనమంతా భరత మాత బిడ్డలమని, ఉత్తరం, దక్షిణం అన్న వాదనలొద్దని హితవు పలికారు.