
పట్టిసీమకు బీజేపీ వ్యతిరేకం
ఏలూరు: పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు... సీఎం చంద్రబాబునాయుడుకు వివరించారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు, రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసేందుకు భూ సేకరణ చట్టం ఆర్డినెన్స్ తీసుకువచ్చారన్న కాంగ్రెస్, ఆప్‌ల వ్యాఖ్యల్ని ఆయన ఈ సందర్భంగా ఖండించారు. ఈ చట్టం ద్వారా భూమికి నాలుగు రెట్ల నష్టపరిహారం ఇవ్వడంతో పాటు భూమి కోల్పోయిన కుటుంబంలోని ఓ వ్యక్తికి ఉద్యోగం కల్పించనున్నట్టు చెప్పారు. ఎర్రచందనం పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లే ఇసుకను కొల్లగొట్టే అధికారుల భరతం పట్టాలని సోము వీర్రాజు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలకు టెలికం, ఫిలిం సెన్సార్ బోర్డుల్లో, అడ్వైజర్, డెరైక్టర్ల పోస్టుల్లో నియమించాలని పార్టీకి నివేదించినట్లు సోము వీర్రాజు చెప్పారు.