సాక్షి, హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్న హైదరాబాద్ యువజన సదస్సుకు దీటుగా మహబూబ్‌నగర్ సదస్సు నిర్వహించడానికి బీజేపీ రాష్ట్ర శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 28న జరిగే ఈ సదస్సుకు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ హాజరవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రకటన చేసిన అనంతరం బీజేపీ నిర్వహిస్తున్న రెండో భారీ సదస్సు ఇదే కావడంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం సర్వశక్తులూ ఒడ్డుతోంది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల నుంచి కార్యకర్తలను.. ప్రత్యేకించి మహిళల్ని సమీకరించేందుకు కసరత్తు ప్రారంభించింది.
మోడీ సదస్సుకు రూ.5 వసూలు చేసి యువజనుల్ని ఆకట్టుకోగా, ఈసారి మహిళలకు బొట్టుబిళ్లలు, కుంకుమ భరిణలతో మహిళలకు స్వాగతం పలకాలని నిర్ణయించింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని ప్రతి గ్రామం నుంచి కనీసం ఐదుగురు మహిళల్ని ఎంపిక చేసి సదస్సుకు ఆహ్వానించనుంది. ఇలా సుమారు 50 వేల మంది మహిళల్ని సమీకరించేలా సన్నాహాలు చేస్తోంది. ఈ బాధ్యతను జాతీయ మహిళామోర్చా కార్యదర్శిగా నియమితులైన మహబూబ్‌నగర్‌కు చెందిన జి.పద్మజారెడ్డికి అప్పగించారు.
కీచక మూకల్ని కఠినంగా శిక్షించాలి
మహిళలపై అత్యాచారాలకు దిగే కీచకమూకలపై ఉదాసీనత వద్దని బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.మాలతీరాణి, జాతీయ కార్యదర్శి జి.పద్మజారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అత్యాచారాల కేసుల్ని విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రిజర్వ్‌డ్ నియోజకవర్గాలపై నేడు, రేపు చర్చ: ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో పార్టీ అవకాశాలు, అభ్యర్థుల గుర్తింపు తదితరాలను చర్చించేందుకు బీజేపీ ఎస్సీ మోర్చా సోమ, మంగళవారాల్లో సికింద్రాబాద్‌లో సమావేశం కానుంది. మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కె.రాములు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సంజయ్ పాశ్వాన్, పార్టీ రాష్ట్ర నేతలు కిషన్‌రెడ్డి, బంగారు లక్ష్మణ్, మురళీధర్‌రావు, డాక్టర్ కె.లక్ష్మణ్ తదితరులు హాజరవుతారు.
మోడీ సభకు దీటుగా సుష్మా సదస్సు
Published Mon, Sep 2 2013 1:46 AM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM
Advertisement
Advertisement