మహబూబ్‌నగర్‌లో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హాన్స్‌రాజ్ గంగారాం అహైర్, లక్ష్మణ్ తదితరులు.
-
అల్లర్లలో పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థల పాత్ర
-
యువతలో దేశభక్తిని చాటేందుకే తిరంగ యాత్ర
-
నిజాం పేరుతో తెలంగాణలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం దౌర్బాగ్యం
-
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హాన్స్‌రాజ్ గంగారాం అహైర్
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి : కశ్మీర్‌లో ఒక అంగుళం జాగాను కూడా వదులుకునేందుకు భారత్ సిద్ధంగా లేదని, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల కుట్రలో భాగమే కాశ్మీర్ అల్లర్లని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హాన్స్‌రాజ్ గంగారాం అహైర్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ మైదానంలో నిర్వహించిన తిరంగా యాత్ర బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలు కశ్మీర్‌లో రెండు శాతం యువతను ప్రేరేపిస్తున్నాయని, అశాంతిని రేకెత్తించేందుకు కుట్రలు చేస్తున్నాయని పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో 135 మంది స్కూల్ విద్యార్థులను ఉగ్రవాదులు కాల్చి చంపినా కనీసం ఉగ్రవాదంపై అక్కడి ప్రధాని మాట్లాడలేదన్నారు. భారత దేశంలోని 125 కోట్ల మంది ప్రజలు కశ్మీర్‌ను వదులుకోరని, ఎట్టిపరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కొని తీరుతామన్నారు. కశ్మీర్‌తో పాటు దేశంలో ఉన్న యువతకు నాదేశం అనే జాతీయ భావాలను, దేశ భక్తిని పెంపొందించడం కోసమే ప్రధానమంత్రి నరేంద్రమోడీ తిరంగాయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ఉగ్రవాదులను అణగదొక్కే శక్తి భారత్‌కు ఉందని, దేశ సరిహద్దులో భారత సైనికులు తమ కుటుంబాల కన్నా దేశాన్ని ప్రేమిస్తూ పోరాటాలు చేస్తున్నారని అన్నారు. ప్రాణాలను లెక్కచేయకుండా సైనికులు పోరాటాలు చేస్తున్నారని, దేశంలోని యువత వారి పోరాటానికి స్ఫూర్తినివ్వాలని అన్నారు. ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన భారతదేశాన్ని దేశంలోని యువత రక్షించుకోవాల్సిన అవసరముందన్నారు. అక్కడికి వెళ్లి సమస్యను పరిష్కరించేందుకు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలను కశ్మీర్‌కు పంపుతున్నారని అన్నారు. నిజాం పేరుతో తెలంగాణలో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం దౌర్బాగ్యమని రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటించారు. రాష్ట్ర అభివృద్ధి, సమగ్రతకు ఈ పరిస్థితి మంచిది కాదన్నారు. దేశంలో సెప్టెంబర్ 17కు ప్రత్యేకత ఉందని, దేశానికి ఆగస్టు 15న స్వాతంత్రం రాగా సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. దేశప్రజలు స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న జరుపుకుంటున్నా, తెలంగాణలో సెప్టెంబర్ 17ను సైతం జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు పట్టణంలో జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్రసహాయ మంత్రి, నాయకులు బైక్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావునామాజి, ప్రధానకార్యదర్శి టి.ఆచారి, కార్యదర్శులు ప్రేమేందర్‌రెడ్డి, శాంతికుమార్, బిజెపి మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి పాల్గొన్నారు.