పాలమూరు సభకు భారీ ఏర్పాట్లు 50 వేల మంది సమీకరణకు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: గుజరాత్ సీఎం నరేంద్ర మోడీతో ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన యువభేరీ సదస్సు జయప్రదమైన నేపథ్యంలో కమలనాథులు మరో భారీ సభకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణపై తమ పార్టీ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని పునరుద్ఘాటించేందుకు, ఏ పార్టీతోనూ పొత్తులుండవని చెప్పేందుకు శనివారం సాయంత్రం మహబూబ్‌నగర్‌లో బీజేపీ ప్రజా గర్జన సభ నిర్వహిస్తోంది. ఈ సభకు లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ ప్రధాన వక్తగా హాజరవుతున్నారు.
సుమారు 50 వేల మందిని, అందులో ఎక్కువగా మహిళల్ని సభకు తరలించేలా పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. మోడీ సభకు దీటుగా ఏర్పాట్లు చేశారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఆశిస్తున్న పలువురు నేతలు జన సమీకరణలో పోటీపడుతున్నారు. పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్న మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి కూడా ఈ సభతో సత్తా చాటాలనుకుంటున్నారు. తన నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణమైన బాలుర జూనియర్ కళాశాలను కాషాయ జెండాలు, నేతల కటౌట్లతో ముస్తాబు చేశారు.
సుష్మా టూర్ ఇలా...: మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే సుష్మా తదుపరి రోడ్డు మార్గాన మహబూబ్‌నగర్ చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు సభలో పాల్గొని రాత్రి 8 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. మర్నాడు ఉదయం 8 గంటలకు పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్న అనంతరం 9.45 గంటలకు ఢిల్లీకి బయల్దేరుతారు.
సుష్మాస్వరాజ్ ‘తెలంగాణ గర్జన’ నేడు
Published Sat, Sep 28 2013 2:56 AM | Last Updated on Fri, Mar 22 2019 2:59 PM
Advertisement
Advertisement