కర్నూలు : కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జాతీయ రహదారిపై గురువారం ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ లోడ్తో వెళుతున్న లారీలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగటంతో గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి. భారీ శబ్దాలతో పేలుడు సంభవించటంతో సమీపంలో ఉన్న ఏనుగుమర్రి గ్రామస్థులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
లారీ సిలిండర్ల లోడ్తో కర్నూలు నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. లారీలో మొత్తం 450 సిలిండర్లు ఉన్నాయి. ఇప్పటివరకూ సుమారు వంద సిలిండర్లు పేలినట్లు తెలుస్తోంది. మరోవైపు పేలుడు ఘటనను గుర్తించిన డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమై లారీలో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.
కాగా ఈ సంఘటనతో జాతీయ రహదారిపై పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నా... సిలిండర్లు పేలి ...ఆ ఇనుప ముక్కలు గాల్లోకి ఎగురుతుండటంతో అక్కడకు చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. పోలీసులు, అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఏనుగుమర్రి గ్రామాన్ని ఖాళీ చేయించారు.