మాస్ కాపీయింగ్‌కు సహకరించలేదని ఆక్రోశం
గీతాంజలి కళాశాలలో ఫ్యాన్లు ధ్వంసం
యలమంచిలి : మాస్ కాపియింగ్‌కు సహకరించలేదని ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. చూచిరాతలు జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడంతో పరీక్షా కేంద్రంలో సీలింగ్ ఫ్యాన్లు ధ్వంసం చేశారు. ఈ నెల 2వ తేదీ నుంచి జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు స్థానిక గీతాంజలి గీతాంజలి జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మాస్ కాపియింగ్ జరగకుండా పరీక్షా కేంద్రం నిర్వాహకులు, ఇన్‌విజిలేటర్లు పక్కాగా వ్యవహరించడంతో చూచిరాతలకు అలవాటు పడిన కొందరు విద్యార్థులు చివరి రోజు పరీక్షా కేంద్రంలో సీలింగ్ ఫ్యాన్లు ధ్వంసం చేసి పరారయ్యారు. బుధవారం ద్వితీయ సంవత్సరం రసాయనశాస్త్రం, వాణిజ్యశాస్త్రం పరీక్షలు నిర్వహించారు.
దాదాపు 250 మంది విద్యార్థులు ఇక్కడ పరీక్షలు రాశారు. మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష ముగిసిన తర్వాత ఇన్విజిలేటర్లంతా విద్యార్థుల నుంచి జవాబు పత్రాలు సేకరించి కార్యాలయంలోకి వెళ్లిన సమయంలో కొందరు విద్యార్థులు ఫ్యాన్లను ధ్వంసం చేసినట్టు పరీక్షా కేంద్రం నిర్వాహకులు చెప్పారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఆర్.నీలిమ, డిపార్ట్‌మెంటల్ అధికారి పి.శ్రీనివాస్, ఇన్విజిలేటర్లు యలమంచిలి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులైన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరారు.