యవ్వనంలో యువతీ యువకుల్లో చిగురించే ప్రేమకు తొలి మెట్టు ఆకర్షణ. అవతలి వ్యక్తి రూపలావణ్యాలు మనసులో అలజడి రేపితే.. ఆ వ్యక్తితో పదేపదే మాట్లాడాలని, స్నేహం చేయాలని..అది ప్రేమానుబంధం కావాలని చాలామంది ఆశిస్తారు.కానీ, వీరి ప్రేమ అటువంటిది కాదు.అతడికి ఆమె రూపమేమిటో తెలియదు.అసలు అందమంటే ఏమిటో కూడా తెలియని దయనీయ స్థితి.కేవలం మాటతీరు, నడవడిక ఆధారంగానే ఆమె వ్యక్తిత్వాన్ని అతడు తెలుసుకున్నాడు.చివరకు వారిద్దరూ మనసులు కలుపుకొన్నారు.ప్రేమంటే ఇవ్వడమే తప్ప, తిరిగి ఆశించడం కాదని నమ్మారు.‘నిన్ను చూడాలని తపించే నా కన్నులకు ఎలా చెప్పను.. నాలోనే నువ్వున్నావని.. నా హృదయ మందిరంలో నువ్వే చిరువెలుగవుతావని..’ అని పరస్పరం ఊసులాడుకున్నారు.ఒకరికొకరు తోడూనీడగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
చివరకు ఆరేళ్ల తమ ప్రేమబంధాన్నిఆ అంధ ప్రేమికులిద్దరూ జీవనబంధంగా మార్చుకున్నారు.తమ ‘చీకటి’ లోకంలో ప్రేమకాంతులు నింపుకొన్నారు.
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఆ యువకుడి పేరు నల్లా దుర్గాప్రసాద్. పుట్టుకతోనే అంధుడు. సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా అయోధ్యలంక. అక్కడే పదో తరగతి వరకూ చదువుకున్నాడు. ఇంటర్మీడియెట్ చదివేందుకు 2014లో రాజమహేంద్రవరంలోని జియోన్ అంధులపాఠశాలలో చేరాడు.
ఆ అమ్మాయి పేరు ఉల్లం మరియ. ఆమె కూడా యాభై శాతం అంధత్వంతో బాధ పడుతోంది. స్వస్థలం రాజమహేంద్రవరం. ఆమె కూడా జియోన్ అంధుల పాఠశాలలోనే ఒకటి నుంచి డిగ్రీ వరకూ చదివింది.
ఒకేచోట ఉండి చదువుకోవడం, ఒకరికొకరు సహకారం అందించుకొంటున్న క్రమంలో మరియ, దుర్గాప్రసాద్ మధ్య ప్రేమ చిగురించింది. పూర్తి అంధుడు కావడంతో దుర్గాప్రసాద్.. మరియ సహకారం తీసుకునేవాడు. డిగ్రీ అనంతరం ఉద్యోగాల ఇంటర్వ్యూలకు కూడా మరియ దగ్గరుండి దుర్గాప్రసాద్‌ను తీసుకుని వెళ్లేది. తనకున్న అంతంతమాత్రం కంటి వెలుగుతోనే దుర్గాప్రసాద్‌కు లోకాన్ని పరిచయం చేసేది. ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడాలి, ఎలా మసలుకోవాలి తదితర అనేక విషయాలను నేర్పించేది. మరియ చూపిన ప్రేమ దుర్గాప్రసాద్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సమన్వయంతో ఇద్దరూ సాగించిన కృషి ఫలితంగా దుర్గాప్రసాద్‌కు హైదరాబాద్‌లోని ఇన్ఫో మీడియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో కస్టమర్ రిలేషన్ ఆఫీసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగంలో చేరేందుకు దుర్గాప్రసాద్ మరియను విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. మరియ తనతో లేని క్షణాలు తనకు మరింత చీకటిని పంచుతున్నాయని దుర్గాప్రసాద్ గుర్తించాడు. దీంతో మరియను తన జీవిత భాగస్వామిగా చేసుకోవాలనే దృఢ నిశ్చయానికి వచ్చాడు. ఆ విషయాన్ని మరియతో పంచుకున్నాడు. వారి పెళ్లికి షరా మామూలుగానే ఇక్కడ కూడా కులం అడ్డుగోడగా నిలిచింది. ఈ వివాహానికి తాము ఒప్పుకోబోమని దుర్గాప్రసాద్ తల్లిదండ్రులు చెప్పారు.
హతాశులైన దుర్గాప్రసాద్, మరియలు.. తాము భగ్నప్రేమికులుగా మిగిలిపోరాదని భావించారు. సుదీర్ఘ ఆలోచనల అనంతరం వారిద్దరూ వైఎస్సార్ సీపీ మాజీ కార్పొరేటర్ గుత్తుల మురళీధరరావు సహకారాన్ని అర్థించారు. ఆయన వారి పెద్దలను పిలిచి మాట్లాడారు. వివాహానికి ఒప్పించారు. దీంతో ఆ ప్రేమికుల పెళ్లికి మార్గం సుగమమైంది. జియోన్ అంధుల పాఠశాలలో సోమవారం ఘనంగా జరిగిన ఈ వివాహానికి లయన్స్ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం గోదావరి సభ్యులు కూడా సహకారం అందించారు. జియోన్ అంధుల పాఠశాల నిర్వాహకుడు జెన్నిబాబు ఆశీస్సులు అందించారు. గౌతమీ జీవకారుణ్య సంఘం కార్యనిర్వహణాధికారి తారకేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు దాసి వెంకటరావు, గుడాల జాన్సన్, పతివాడ రమేష్, ఉల్లం రవి తదితరులు ఆ ప్రేమజంటకు శుభాశీస్సులు అందించారు.
వధూవరులను ఆశీర్వదిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు
తనే నా లోకం
మరియ పరిచయంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అనుక్షణం నా వెంటే ఉండేది. నాకు కళ్లు లేవని బాధ పడినప్పుడల్లా తాను తన కళ్లతో లోకాన్ని చూపించేది. నేను ఎలా ఉంటానో నాకు తెలియదు. కానీ నేను ఎలా ఉంటానో ఆమె నాకు చెప్పేది. ఎవరితో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో చెప్పేది. అందువల్లనే నేను ఉద్యోగం సంపాదించగలిగాను. తనకి ఏ లోటూ రాకుండా చూసుకుంటాను.– నల్లా దుర్గాప్రసాద్, వరుడు
తనతోనే నా ప్రపంచం
ఆరేళ్ల క్రితం అతను ఇక్కడికి వచ్చినప్పటి నుంచీ ప్రతి చిన్న విషయానికీ నన్ను మరియా, మరియా అని పిలిచేవాడు. భగవంతుడు నాకు కొంత చూపు ఇచ్చింది వేరొకరికి సాయం చేయడానికేనని అనుకునేదాన్ని. అది ఎవరికో కాదు.. తనకేనని అర్థమైంది. దీంతో ప్రసాద్‌కు చదువుతో పాటు అందరితో ఎలా మాట్లాడాలో నేర్పించే దాన్ని. ఇప్పటికీ తనకి ఏం కావాలో అన్నీ నేనే చూ సుకుంటాను. మా ఇద్దరి ప్రేమను అంగీకరించిన పెద్దలకు, వైఎస్సార్ సీపీ నాయకులకు ధన్యవాదాలు. – ఉల్లం మరియ, వధువు
Comments
Please login to add a commentAdd a comment